ముంచెత్తిన వాన | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన వాన

Published Mon, Aug 13 2018 11:07 AM

Heavy Rains In East Godavari Agency Area - Sakshi

కొవ్వూరు/నిడదవోలు: అల్పపీడన  ప్రభావంతో మూడు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభిస్తోంది.రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునగడంతో ప్రజలు అల్లాడుతున్నారు.  దీనికితోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద కూడా పోటెత్తుతోంది. ఉప నదులైన ప్రాణహిత , ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆనకట్ట వద్ద పాండ్‌ లెవెల్‌ 13.11 మీటర్లకు చేరింది.

దీంతో ఆనకట్ట మొత్తం 175 గేట్లను 1.2 మీటర్ల ఎత్తులేపి 3,90,192 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 7,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 4,200, సెంట్రల్‌ డెల్టాకు 1,500, జిల్లాలోని పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమడెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 769, నరసాపురం కాలువకు 1,501, తణుకు కాలువకు 656, ఉండి కాలువకు 507 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. అత్తిలి కాలువకు నీటిని విడుదల నిలిపివేశారు. గోదావరి ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు క్రమేణా పెరుగుతుండటంతో సోమవారం సాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృ తి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ శాఖా«ధికారులు అంచనా వేస్తున్నారు.

11.3 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం
గత 24 గంటల్లో జిల్లాలో 11.3 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. వేలేరుపాడులో గరిష్టంగా 70 మిల్లీమీటర్లు, కుక్కునూరులో 58.2 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం, కోపల్లి వద్ద కొవ్వాడ, అరసుల వాగు  జల్లేరు వాగు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీలుగుమిల్లి మండలంలోని సంగం వాగు, అశ్వారావుపేట వాగులు కూడా పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. గంటకు 3,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం గరిష్ట సామర్థ్యం 83.50 మీటర్లు కాగా, ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 80.30 మీటర్లకు చేరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement