భక్తులకు క్షవర భారం

Heave Charges Hikes at Temples - Sakshi

ప్రధాన దేవాలయాల్లో కేశఖండన చార్జీలు పెంపు

రూ. 25కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, విజయవాడ: భక్తులపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. ప్రముఖ దేవాలయాల్లో కేశఖండన చార్జీలను పెంచింది. టికెట్‌ రేటును 25 రూపాయలుగా నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఇప్పటికే ఈ చార్జీల వసూళ్లు మొదలయ్యాయి. గతంలో విజయవాడ దుర్గగుడిలో, శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయాల్లో కేశఖండనకు రూ. 20 చార్జీ వసూలు చేసేవారు. ద్వారకా తిరుమలలో రూ.17,  అన్నవరం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గుడి, సింహాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. ఇప్పుడు ఈ దేవాలయాల్లో కేశఖండన టిక్కెట్ల ధరను రూ. 25కు పెంచుతూ ఈ మొదటి వారంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఆలయాల్లో కొద్ది రోజులుగా కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు.

భక్తుల నుంచి వసూలు చేసి నాయీ బ్రాహ్మణులకు కమీషన్‌గా చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయంతో కేశఖండన రేట్లు పెంచినట్లు చెబుతున్నారు. అయితే కేశఖండన బ్లేడ్‌ చార్జీలను దేవస్థానాలు భరించనున్నాయి. తలనీలాలు విక్రయించడం ద్వారా ప్రధాన ఆలయాలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి గత ఏడాది తలనీలాలు వేలం ద్వారా రూ. 6.09 కోట్లు ఆదాయం సమకూరింది.  వాస్తవంగా ఈ ఆదాయం నుంచి కనీసం పది శాతం తీసినా భక్తులపై భారం వేయకుండా నాయీ బ్రాహ్మణులకు కమీషన్‌ పెంచవచ్చు.

ప్రధాన దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులు తమకు ప్రతి నెలా కనీసం రూ.15 వేలు వేతనం ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ  డిమాండ్‌ను విన్నవించారు. ఆ సమయంలో వారిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షురకుల కమీషన్‌ను రూ. 25 పెంచారు. ప్రభుత్వం అటు నాయీ బ్రాహ్మణులకు సరైన న్యాయం చేయక, ఇటు భక్తులపై భారం మోపడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్‌ చార్జీలను కనీసం రూ. 20కు తగ్గించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top