వడ్డీ పిండేస్తున్నారు..

Harassments Of Moneylenders In Vizianagaram District - Sakshi

పేట్రేగిపోతున్న వడ్డీ వ్యాపారులు 

అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్న వైనం

గరివిడి: జిల్లాలో వడ్డీ వ్యాపారులు కాలసర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అత్యవసరంగా నగదు అవసరమై వచ్చిన వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వడ్డీ మీద వడ్డీ వేస్తూ వారి శ్రమను జలగల్లా పీల్చుకుంటున్నారు. బారువడ్డీ, చక్రవడ్డీ అంటూ అసలు కన్నా వడ్డీయే ఎక్కువగా లాగేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరండంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరు వడ్డీ వ్యాపారులు పోలీస్‌ స్టేషన్లలో పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ బాకీలు వసూలు చేసుకుంటున్నారు. పట్టణాల్లో అయితే ఈ వడ్డీ వ్యాపారం అధికంగానే నిర్వహిస్తున్నారు. కొంతమంది పెత్తందార్ల సపోర్ట్‌తో ఈ వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారం మూడు ప్రామిసరీ నోట్లు..ఆరు ఖాళీ చెక్కులు అన్న చందంగా విచ్చలవిడిగా సాగుతోంది.

కోర్టు కేసుల పేరిట వేధింపులు.. 
అప్పు కోసం తమ వద్దకు వచ్చేవారి నుంచి వడ్డీ వ్యాపారులు బ్యాంక్‌ ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు తీసుకుని ఖాళీ ప్రాంశరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. డబ్బు ఇచ్చే సమయంలో రూ. 100కు రూ. 10 నుంచి రూ.20 తగ్గించి మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. వడ్డీ మాత్రం వంద రూపాయలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది నిస్సహాయులు భవనాలు, భూములు, నగలు, ఇళ్లను తనఖా పెడుతున్నారు. వారు వడ్డీ చెల్లించడంలో ఆలస్యమైతే వడ్డీ వ్యాపారులు ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రుణ గ్రహీత వడ్డీ చెల్లించడం ఆలస్యమైనా.. వడ్డీ అధికమని ప్రశ్నించినా.. వారి ఇచ్చిన ఖాళీ చెక్కులు, ప్రాంశరీ నోట్ల ఆధారంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. నూటికి తొంబై శాతం మంది వడ్డీ వ్యాపారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవు. ఇటీవల అవినీతి శాఖాధికారులు పలువురు అధికారులను పట్టుకుంటున్న సందర్భాల్లో కూడా అధిక మొత్తంలో ప్రాంశరీ నోట్లు  దొరకడం విశేషం. బాధ్యతాయుతమైన అధికారులు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఏసీబీ దాడుల వల్ల తెలిసింది.

వడ్డీ వసూలు చేసేది ఇలా.. 
రూ. లక్ష తీసుకుంటే నాలుగు నుంచి పది రూపాయల వరకూ వడ్డీ వసూలు చేస్తారు. నెల నెలా కొంత మొత్తాన్ని అసలు కింద జమచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణ గ్రహీత నెల నెలా అసల కింద సొమ్ము జమ చేస్తున్నా వడ్డీ మాత్రం చివరి నెల వరకూ రూ. లక్షకే వసూలు చేస్తారు. ఈ లెక్కన రుణ గ్రహీత తీసుకున్న సొమ్ముతో సమానంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.  

కఠిన చర్యలు..  
వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు. ఎవరినీ వేధింపులకు గురి చేయకూడదు. అధిక వడ్డీ, వేధింపులపై బాధితులు ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు.
– కె. కృష్ణ ప్రసాద్, ఎస్సై, గరివిడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top