మొదట్లో మహాస్ట్రిక్ట్.. ఇప్పుడు అవినీతి మరక | Sakshi
Sakshi News home page

మొదట్లో మహాస్ట్రిక్ట్.. ఇప్పుడు అవినీతి మరక

Published Mon, Aug 4 2014 2:18 AM

మొదట్లో మహాస్ట్రిక్ట్.. ఇప్పుడు అవినీతి మరక - Sakshi

హనుమాన్ జంక్షన్(కృష్ణా) :అకుంఠత దీక్ష, కృషి, పట్టుదలతో పోలీసుశాఖకు ఎంపికైన హనుమాన్ జంక్షన్ ఎస్సై బి.ప్రభాకరరావు అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కడం ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఆయన శనివారం రాత్రి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 2009 బ్యాచ్‌కు చెందిన ప్రభాకరరావు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ పరిధిలోనే ఆయన పనిచేశారు.
 
 విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గని అధికారిగా తొలినాళ్లలో మంచి పేరు సంపాదించారు. వీరవల్లి ఎస్సైగా పని చేస్తున్నప్పుడు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహించటంతో ఆటో డ్రైవర్లు మొదలుకుని రాజకీయ నాయకుల వరకు ‘బాబోయ్.. ఈ ఎస్సై మాకొద్దు’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా పలుమార్లు పోలీస్ స్టేషన్ ఎదుట అందోళనలు నిర్వహించిన ఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత హనుమాన్‌జంక్షన్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. మొదట్లో ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సమదూరం పాటిస్తూ వచ్చారు. ఆయన ప్రవర్తనలో క్రమేణా మార్పు వచ్చింది.
 
 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి అడపదడపా ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరుగొలనుకు చెందిన కొండపావులూరి శాస్త్రీజీ(నాని) తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ మహిళ గత జనవరిలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై ప్రభాకరరావు చేపట్టిన విచారణలో అది తప్పుడు ఫిర్యాదు అని నిర్ధారణ అయింది. రూ. 20 వేలు ఇస్తే కేసు ఎత్తివేస్తానని నానిని ప్రభాకరరావు డిమాండ్ చేశారు. దీంతో నాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పథకం ప్రకారం తొలుత నానికి డబ్బులిచ్చి ఎస్సై దగ్గరకు పంపారు. ఆ సొమ్ము తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ప్రభాకరరావు ఇప్పుడు తీవ్ర అవమాన భారంతో తలదించుకునే పరిస్ధితికి చేరాడు.
 
 సబ్‌జైలుకు తరలింపు
 ప్రభాకరరావును ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హజరుపర్చారు. న్యాయమూర్తి ఆయనకు 12 రోజుల రిమాండ్ విధించటంతో విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.

Advertisement
Advertisement