వైకల్యం ఓడింది..

Handicapped Cricket Team Selection in Srikakulam - Sakshi

ఉత్సాహంగా దివ్యాంగుల క్రికెట్‌ జట్టు ఎంపికలు

సకలాంగులకు తీసిపోని         ఆటతీరుతో రాణింపు

15 మందితో జాబితా ఖరారు

ఈ నెల 12 నుంచి సిక్కోలు ఆతిథ్యంలో నార్త్‌జోన్‌ దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీ

వారి ధృడ సంకల్పం ముచ్చట గొలిపింది.. వారి పట్టుదల ఆశ్చర్యం కలిగించింది.. వారి గెలుపు ఏ ప్రపంచ కప్పుకూ తీసిపోనిది.. వారి ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది. ఔను.. వారి మనోశక్తి ముందు వైకల్యం ఓడింది.. విధి వెక్కిరించినా వారిని విజయం వరించింది.. ఆదివారం నగరంలో జరిగిన దివ్యాంగుల క్రికెట్‌ రసవత్తరంగా సాగింది.. శరీరం సహకరించకపోయినా పట్టుదలగా ఆడిన ప్రతి ఒక్కరూ విజేతగా నిలిచారు.

శ్రీకాకుళం న్యూకాలనీ:  జిల్లా దివ్యాంగుల క్రికెట్‌ జట్టు ఎంపికలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాల మైదానం వేదికగా ఆదివారం జిల్లాస్థాయి ఎంపికలు జరిగాయి.  జిల్లా నలుమూలల నుంచి 30 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు, గతంలో అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీలో రాణించిన క్రికెటర్లను తుది జట్టుకు పరిగణనలోకి తీసుకున్నారు. 15 మంది సభ్యులతో కూడిన జాబితాను జిల్లా దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి, జి.అర్జున్‌రావురెడ్డి వెల్లడించారు.

ఆటతీరు అదుర్స్‌..
సకలాంగులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆకట్టుకునే ఆటతీరుతో దివ్యాంగ క్రికెటర్లు రాణించారు. తమకే సాటివచ్చిన ఆటతీరుతో అలరించారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మంత్రముగ్ధులను చేసి భళా అనిపించారు. ఫీల్డింగ్‌లో మెరికల్లా కదిలారు.

సిక్కోలు వేదికగా నార్త్‌జోన్‌ పోటీలు..
నార్త్‌జోన్‌ దివ్యాంగుల క్రికెట్‌ పోటీలకు శ్రీకాకుళం జిల్లా మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 12 నుంచి 14 వరకు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ  టోర్నమెంట్‌ కోసం జిల్లా దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మైదానాన్ని పోటీలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెస్సార్‌ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సంఘ కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి పేర్కొన్నారు. నార్త్‌జోన్‌ దివ్యాంగుల సంఘం హెడ్‌ మధుసూదన్‌ ఇప్పటికే జిల్లా చేరుకున్నారు.

జిల్లా జట్టు ఇదే..
బగ్గు రామకృష్ణ (కెప్టెన్‌– బలగ), సీహెచ్‌ అప్పలరాజు, ఐ.దిలీప్‌ (బలగ), బి.హిమగిరి (చిన్నకిట్టాలపాడు), ఎం.రాజు (సంతకవిటి), పి.రాజు, ఎం.ప్రసాద్‌ (రాజాం), ఎన్‌.నరేష్‌ (నరసన్నపేట), కె.రవి (పలాస), ఎ.సాయికుమార్, ఎస్‌.సాయిశేఖర్‌ (శ్రీకాకుళం), కె.శ్రీను (భామిని), కె.రాముజ (రణస్థలం), పి.తిరుపతిరావు, కె.నాగరాజు. స్టాండ్‌బైగా మోహనరావు, ఎం.ప్రసాద్‌ ఎంపికైనవారిలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top