నకిలీ భార్యతో విదేశాలకు చెక్కేశాడు

Guntur Man flies to foreign with fake wife - Sakshi

మరో మహిళను భార్యగా చూపించి పాస్‌పోర్ట్‌ పొందిన వైనం

భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..

మర్రిపాలెం(విశాఖ ఉత్తరం): పెళ్లయ్యి 37 ఏళ్లు.. ముగ్గురు పిల్లలకు తండ్రి. కానీ భార్య, బిడ్డల్ని వదిలేసి మరో మహిళతో కలసి అడ్డదారిలో పాస్‌పోర్టు తీసుకొని విదేశాలకు చెక్కేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విశాఖ పాస్‌పోర్టు అధికారులను కలసి తన గోడు చెప్పుకుంది.

వివరాలు.. గుంటూరు జిల్లా ఆర్‌.అగ్రహారానికి చెందిన దాసరి భవానికి 1980లో ఈశ్వర ప్రసాద్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఈశ్వరప్రసాద్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇందుకు భార్య అడ్డుగా ఉండటంతో.. ఆ మహిళతో కలసి విదేశాలకు వెళ్లిపోవాలకున్నాడు. 2015లో హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. 2017లో మళ్లీ విశాఖ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసినా.. వివరాలు తప్పుగా ఉండటంతో పాస్‌పోర్ట్‌ మంజూరు కాలేదు. మళ్లీ పున:పరిశీలన కోసం దరఖాస్తు చేయగా విశాఖ పాస్‌పోర్టు కార్యాలయం ఆదేశాల మేరకు గుంటూరు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారణ జరిపారు.

విచారణలో ఈశ్వరప్రసాద్‌ అసలు విషయం బయటపడటంతో పోలీసులు పాస్‌పోర్ట్‌ ఇవ్వొద్దని నివేదిక ఇచ్చారు. అయినా అడ్డదారిలో పాస్‌పోర్ట్‌ సంపాదించిన ఈశ్వరప్రసాద్‌ గతేడాది సదరు మహిళతో కలసి బ్రిటన్‌ వెళ్లిపోయి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భవాని.. ఇటీవల పాస్‌పోర్ట్‌ అధికారి ఎన్‌వీఎస్‌ చౌదరిని కలసి ఫిర్యాదు చేసింది. పాస్‌పోర్ట్‌ ఎలా మంజూరు అయ్యిందని ఆరా తీసింది. పెళ్లి ఫొటోలు, శుభలేఖ, ధ్రువపత్రాలు చూపించగా.. పరిశీలిస్తామని పాస్‌పోర్ట్‌ అధికారి చెప్పడంతో ఆమె తిరిగి గుంటూరుకు వెళ్లిపోయింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు ‘సాక్షి’ని ఆశ్రయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top