కరోనా.. దాక్కోలేవు! | Grama Volunteer Update NRI List in Anantapur | Sakshi
Sakshi News home page

ఇంటింటా వలంటీర్ల సర్వే

Mar 27 2020 7:47 AM | Updated on Mar 27 2020 7:48 AM

Grama Volunteer Update NRI List in Anantapur - Sakshi

కణేకల్లులో ఇంటింటా సర్వే చేస్తున్న వలంటీర్లు

మడకశిర మండలానికి చెందిన కొందరు ఉపాధి కోసం నేపాల్‌కు వెళ్లారు. ఉగాది పండుగను పురస్కరించుకుని వారంతా ఈనెల 22న తిరిగి సొంత ఊళ్లకు చేరుకున్నారు. వీరి సమాచారాన్ని గ్రామ వలంటీర్లు అధికారులకు చేరవేశారు. ఎంపీడీఓ, ఎస్‌ఐ, వైద్యాధికారులు ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. దేశ సరిహద్దులో వైద్య పరీక్షలు చేశారని, వ్యాధి లక్షణాలు లేవని తెలుసుకుని వారికి అవగాహన కల్పించి వెళ్లారు.

.. ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా గ్రామవలంటీర్లు ఇదే తరహాలో సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తున్నారు.  కరోనాపై పోరాటంలో గ్రామ వలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా..  గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించినా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ, ఏ మారుమూల గ్రామాల్లో చిన్న ఘటన చోటు చేసుకున్నా వలంటీర్లు ఇట్టే స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌     జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి కొండంత అండగా నిలుస్తోంది.

అనంతపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న వలంటీర్లు ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ముచ్చెమటలు పట్టిస్తున్న ‘కరోనా వైరస్‌’ కట్టడిలోనూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50–60 ఇళ్లకు ఒక వలంటీరును నియమించి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వానికి వారధిలా పని చేసేందుకు చర్యలుతీసుకుంది. ప్రజలకు నిత్యం అత్యంత దగ్గరగా ఉండే వలంటీర్లు ప్రస్తుతం గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానం కలిగినా వెంటనే అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రభుత్వ పిలుపుతో వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. వైద్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వివరాలన్నీ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎవరికైనా జలుబు, తలనొప్పి, జ్వరం, ఇతరత్రా అనారోగ్యం ఉన్నట్లు గుర్తిస్తే వారిని ఆస్పత్రులకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు.

అధికారుల దృష్టికి వివరాలు
ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి ఇటీవల స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారి వివరాల సేకరణలో వలంటీర్లు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వలంటీర్ల ద్వారానే పలువురి వివరాలను అధికారులు సేకరించారు. ఒక వలంటీరు తన పరిధిలోని 50–60 ఇళ్లలోని వ్యక్తులు ఎంతమంది ఏమి పని చేస్తున్నారు.. ఎక్కడ చేస్తున్నారనే వివరాలు ఇదివరకే సిద్ధం చేసుకున్నారు. దీనికితోడు రోజూ ఆ ఇళ్ల చుట్టూ తిరుగుతుండడంతో ఆ కుటుంబాల్లోని వ్యక్తులు బయట నుంచి వచ్చినా.. లేదా కొత్తవారెవరైనా వచ్చినా వలంటీరుకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ వివరాలను వలంటీర్లు తమ సచివాలయ అధికారులకు చేరవేస్తున్నారు.

ప్రతి ఇల్లూ తిరుగుతున్నారు  
కరోనా వైరస్‌ నేపథ్యంలో వలంటీర్లు ప్రతి ఇల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. వైద్య సిబ్బందితో కలిసి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుని యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతన్నట్లు గుర్తిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.– రామనాథరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement