‘యథా ప్రజా తథా రాజాలా ఉండాలి’

Governor Narasimhan Speech On Voters Day In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : కులం, మతం, డబ్బు ఓటుకు ప్రామాణికం కాకూడదని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవు ఉన్నప్పటికీ పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి’  అని వ్యాఖ్యానించారు.  ఓటుతో మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం అంటూ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రంలో భాగంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు గవర్నర్‌ గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయడంతో పాటుగా ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రతిఙ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు సీఎస్‌ అనిల్ చంద్ పునీత, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు 1950
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని... అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటరు నమోదుపై సందేహాల నివృత్తికై 1950 అనే టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top