నవ్విపోదురుగాక.. | government schools officials not responding | Sakshi
Sakshi News home page

నవ్విపోదురుగాక..

Apr 10 2014 2:49 AM | Updated on Oct 20 2018 6:17 PM

నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు అనే చందంగా జిల్లా విద్యాశాఖ తీరు తయారైంది. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, విధేయతగా ఉంటే చాలు అందలం ఎక్కిస్తామని సంబంధిత అధికారి వ్యవహరిస్తున్నారనేందుకు ఉదాహరణలున్నాయి.

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు అనే చందంగా జిల్లా విద్యాశాఖ తీరు తయారైంది. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, విధేయతగా ఉంటే చాలు అందలం ఎక్కిస్తామని సంబంధిత అధికారి వ్యవహరిస్తున్నారనేందుకు ఉదాహరణలున్నాయి. అన్యాయంపై ప్రశ్నిస్తే వేధించడం పరిపాటిగా మారింది. పరిపాలనను చక్కదిద్దాల్సిన జిల్లా ఉన్నతాధికారి సైతం పట్టించుకోకపోవడంతో విద్యాశాఖలో ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. విద్యాశాఖ వింతలీలల్లో ఇదో చక్కటి ఉదాహరణ.
 
 మండల కేంద్రమైన రాపూరులోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఎస్.శేషాద్రివాసు అదే గ్రామంలోని బాలికల పాఠశాలలో కూడా కొంత కాలం ఇన్‌చార్జ్ హెచ్‌ఎంగా వ్యవహరించారు. అప్పుడు ఓ ఉపాధ్యాయురాలిని వేధించారనే అరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెండ్ వేటు పడింది.
 
 ఈ మేరకు ఆర్‌జేడీ పార్వతి 2013, నవంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌లో ఉన్న ఈ హెచ్‌ఎంను డీఈఓ పదో తరగతి పరీక్షల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే కస్టోడియన్‌గా నియమించారు. ఈయనకు జీతాలు కూడా లేవు. అయినా ఘనత వహించిన మన నె ల్లూరు విద్యాశాఖ ఆయన్ను అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం ఆయన  పిడతాపోలూరులోని సెల్ఫ్ సెంటర్‌లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయనే పోలీసు స్టేషన్‌కెళ్లి పదో తరగతి ప్రశ్నాపత్రాలు తీసుకొస్తున్నారు. ఇందు కోసం ఈయనకు ప్రభుత్వం టీఏ, డీఏ చెల్లిస్తోంది.
 
 ఈయన కనుపర్తిపాడు, రాపూరుతో పాటు పనిచేసిన పలుచోట్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో పొదలకూరులో ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రశ్నాపత్రాలు లీకయ్యినపుడు మీడియాలో దుమారం రేగింది. అప్పుడు అక్కడ ఇదే హెచ్‌ఎం అధికారిగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఈ పెద్దమనిషికి పదో తరగతి పరీక్షల నిర్వహణలో కస్టోడియన్‌గా బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఈఓ కార్యాలయ ఉన్నతాధికారి, ఈ హెచ్‌ఎంకు మధ్య అవినాభావ సంబంధాలు ఉండటమే దీనికి కారణమని ఉపాధ్యాయ లోకం కోడైకూస్తోంది.
 
 సమాచార హక్కు చట్టం కింద
 సేకరించిన విషయాలు:
 హెచ్‌ఎం ఎస్.శేషాద్రివాసును రీ యిన్‌స్టేట్ (సస్పెన్సన్ రద్దు చేసి విధుల్లోకి తీసుకోవడం) చేసే అధికారం ఆర్జేడీకి ఉందని డీఈఓ కార్యాలయం గత ఏడాది డిసెంబర్ 31న తెలిపింది.
 శేషాద్రివాసు హెచ్‌ఎంగా కొనసాగుతున్నట్టు తెలిపే సమాచారం గుంటూరు ఆర్జేడీ నుంచి రాలేదని క్లియర్‌గా తెలిపారు.
  ఈ వివరాలపై డీఈఓ ఇన్సియల్ కూడా ఉంది.
 
  సస్పెన్షన్ రద్దుకు నో
 అన్న ఆర్జేడీ
 ఆర్‌జేడీ పార్వతి హెచ్‌ఎం సస్పెండ్‌ను రద్దు చేసేది లేదంటూ కోర్టుకు అప్పీలుకు కూడా వెళ్లారు. ఆయనపైన బలమైన ఆరోపణలున్నాయని కోర్టుకు నివేదించారు.  అంతే కాక జీతాలు ఇవ్వద్దంటూ రాపూరు ఎస్టీవో కార్యాలయానికి ఉత్తర్వులను కూడా పంపారు.    
 
 హెచ్‌ఎం సస్పెన్షన్‌లో
 ఉంటూ ఏం చేశారంటే..
 కావాలనే కాంప్లెక్స్ పాఠశాలలను తనిఖీ చేశారు.
  పదో తరగతి విద్యార్థులకు రాపూరు ఉన్నత పాఠశాలలో సేవా భారతి ట్రస్టు ప్రతి సంవత్సరం  ఫీజులు చెల్లిస్తుంది. అయినప్పటికీ పదో తరగతి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
 
 ఆరు నెలలుగా జీతాలు తీసుకోలేదు. అయినా రెండు, మూడు రోజులకు ఒకసారి స్కూల్‌కు వెళ్లి సంతకాలు చేశారు.
 ఇలాంటి వ్యక్తి కోసం..
 ఇలాంటి హెచ్‌ఎంను గతంలో ఓపెన్ స్కూల్స్‌కు సంబంధించి హైపవర్ కమిటీలోకి విద్యాశాఖ  తీసుకొంది. అంతేకాడు టీఏ, డీఏలు  చెల్లించింది.
 
 విద్యాశాఖకు సూటి ప్రశ్నలు:
  కోర్టు తీర్పు వచ్చిన చాలా రోజుల తర్వాత  హెచ్‌ఎం సస్పెండ్‌ను  రద్దు చేసినట్టు (రీయిన్‌స్టేట్) ఆర్జేడీ కార్యాలయం నుంచి  తమకు ఉత్తర్వులు రాలేదని డీఈఓ కార్యాలయం సమాచార హక్కు చట్టం ప్రకారం ఎందుకు సమాధానమిచ్చింది.
 హెచ్‌ఎంగా కొనసాగుతున్నట్టు కూడా ఆర్జేడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని సమాధానం ఎందుకిచ్చారు. ఇలా సమాధానాలు ఇచ్చి కూడా పది పరీక్షల విధుల్లోకి ఎలా తీసుకున్నట్టు.
 
 పట్టించుకోని ఉన్నతాధికారి
 విద్యాశాఖలో గందరగోళ నిర్ణయాలు జరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారి పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. అందుకే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. చిన్నస్థాయి ఉద్యోగుల తప్పులపై విరుచుకుపడే ఉన్నతాధికారి  రాజకీయ పలుకుబడి ఉండే వారి విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి స్పందించి విద్యాశాఖను గాడిలో పెట్టాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement