వేతనాలు అడిగితే ఈడ్చేశారు

Government over action on contract workers - Sakshi

     కాంట్రాక్టు కార్మికుల ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం

     కార్మికులను బలవంతంగా ఈడ్చేసి వాహనాల్లో తరలింపు

     దాదాపు 200 మంది అరెస్టు

సాక్షి, అమరావతి బ్యూరో: విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల విద్యుత్‌ సౌధ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ‘వేతనాలు పెంచండి మహాప్రభో’ అని నినదించిన కార్మికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. న్యాయమైన వేతనాల కోసం ఆందోళనబాట పట్టిన వారిపై పోలీసు జులుం ప్రదర్శించింది. వందలాదిమంది కార్మికులను పోలీసులు బలవంతంగా ఈడ్చేసి అరెస్టులు చేశారు. డిమాండ్ల సాధన కోసం ఓ కార్మికుడు సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఎక్కడికక్కడ అరెస్టులు 
వేతనాలు పెంపు ఇతరత్రా డిమాండ్లతో విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు కొన్ని నెలలుగా దశలవారీగా ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని విద్యుత్‌ సౌధ ముట్టడి చేపట్టారు. అయితే విద్యుత్‌ సౌధకు వచ్చే అన్ని మార్గాలను పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే మూసివేశారు. తనిఖీలు చేస్తూ విద్యుత్తు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో దాదాపు వెయ్యిమందిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 200 మందికిపైగా కార్మికులు వేరేమార్గంలో ఒక్కసారిగా గుణదల చేరుకుని విద్యుత్‌ సౌధను ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చివేసి వాహనాల్లోకి ఎక్కించారు.

కార్మికుల వెంటపడి మరీ లాఠీలతో కొడుతూ అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.గఫూర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి కె.మల్లికార్జునరెడ్డి, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కల్లేపల్లి శైలజ తదితరులతోపాటు 200 మంది కార్మికులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇంతలో విజయ్‌ అనే కార్మికుడు విద్యుత్‌ సౌధ వద్ద ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కారు.

తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు గంట తరువాత ఇద్దరు కానిస్టేబుళ్లు టవర్‌ఎక్కి ఆయన్ని ఒప్పించి కిందకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, న్యాయమైన వేతనాలు కల్పించాలన్న తమ ఆందోళనను పోలీసు బలంతో అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని కె.మల్లికార్జునరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాన్చుడు వైఖరి విడనాడి తమ  డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అణచివేత వైఖరికి బెదిరేదిలేదని ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top