రేపటి నుంచి నూతన మద్యం విధానం

Government New Alcohol Policy In AP - Sakshi

సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీగా మద్య నిషేధ హామీ అమలుకు మరో 24 గంటల సమయమే ఉంది. రాష్ట్రంలో నూతన మద్యం విధానం మంగళవారం నుంచి అమలుకానుంది. ఇన్నాళ్లూ ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో నిర్వహించబడిన మద్యం దుకాణాలు అక్టోబర్‌ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. మద్యం దుకాణాల నిర్వహణకు ఇప్పటికే టెండర్ల పద్ధతిలో దుకాణాలను అద్దెకు తీసుకుని వాటి నిర్వహణకు 168 మంది సూపర్‌వైజర్లు, 434 మంది సేల్స్‌మన్లను అధికారులు ఎంపిక చేశారు. మద్యం అమ్మకాలు తగ్గించడమే కాకుండా మందుబాబులకు మద్యం విరివిగా దొరకకుండా మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించారు. దీంతో జిల్లాలో ఉన్న 210 మద్యం దుకాణాలు 168కి తగ్గిపోయాయి.

బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం
గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా భావించి విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తెరతీసిన విషయం తెలిసిందే. అయితే మహిళల ఇబ్బందులను గమనించిన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్టుదుకాణాలపై ఉక్కుపాదం మోపారు. అలాగే ఎంఆర్‌పీకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మద్యం దుకాణాల ఏర్పాటు, విధివిధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను అధికారులకు వివరించారు. నూతన మద్యం విధానం సక్రమంగా అమలయ్యేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

నిల్వల తగ్గింపు 
ప్రైవేట్‌ మద్యం దుకాణాల నిర్వహణకు ఒక్కరోజే గడువు ఉండడంతో వ్యాపారులు మద్యం నిల్వలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా డిపో నుంచి మద్యం కొనుగోళ్లు తగ్గించి ఉన్న నిల్వల విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఆఖరి రోజు వరకు మద్యం నిల్వలుంటే ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సోమవారం రాత్రికి అధికారులే నిల్వలను స్వాధీనం చేసకోనున్నారు. దీంతో వ్యాపారులు విక్రయాలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లాలో 168 మద్యం దుకాణాల నిర్వహణకు షాపులను టెండర్ల ద్వారా తీసుకున్నాం. అలాగే సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్లను నియమించాం. 13 ఎక్సైజ్‌స్టేషన్ల పరిధిలోని ఎక్సైజ్‌ అధికారులకు దుకాణాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తాం. పాత మద్యం విధానం ముగిసిపోనున్నందున రెండు రోజులుగా మద్యం సరఫరా నిలిపేశాం. సోమవారం రాత్రి గడువు ముగిసిన వెంటనే వ్యాపారులు నిల్వ ఉన్న సరుకును అధికారులకు అప్పగించాలి. లేనిపక్షంలో అధికారులే స్వాధీనం చేసుకుంటారు.           
– ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు, అసిస్టెంట్‌ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top