ఎవడబ్బ సొమ్మని.. బెదిరిస్తున్నారు

Government Employees Took The Pension Books - Sakshi

ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తీరాలన్న తాపత్రయంతో టీడీపీ వర్గాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. తాజాగా పింఛన్లు తీసుకుంటున్న పింఛన్‌దారులను టీడీపీకి ఓటు వేయకుంటే పింఛన్లు ఆగిపోతాయని బెదిరిస్తున్నారు. పింఛన్ల పంపిణీ చేస్తున్న అధికారులు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరి స్తున్నారు. కొన్నిచోట్ల టీడీపీకి అనుకూలంగా ఉన్న సిబ్బందికి పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు ఈ వ్యవహారాన్ని నిలదీసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదేమి చోద్యమంటూ పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, రాజానగరం: ‘టీడీపీకి ఓటు వేయకుంటే పింఛ ను రాద’ంటూ కొంతమం ది ప్రభుత్వోద్యోగులు సామాజిక పింఛన్ల బట్వా డాలో వృద్ధులు, దివ్యాం గులు, వితంతవులను బెదిరిస్తున్నారని వైఎస్సా ర్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. ఎవడబ్బ సొమ్ముని ఇలా బెదిరిస్తున్నారు? అవేమైనా మీ జేబులో సొమ్ములా? లేక చంద్రబాబు జేబులోంచి ఇస్తున్నారా? అంటూ పింఛన్లు బట్వాడా చేస్తున్న ఉద్యోగులను నిలదీశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జి. యర్రంపాలెంలో కొంతమంది పింఛనుదార్ల పాస్‌బుక్‌లు తీసుకుంటున్నారని తెలియడంతో మంగళవారం ఆమె అక్కడకు చేరుకున్నారు. టీడీపీకి చెందిన వారైతే వారి నుంచి పాస్‌బుక్‌లు తీసుకోకుండా, ఇతరుల నుంచే పాస్‌బుక్‌లు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

టీడీపీ ఓటు వేయకపోతే పింఛను రాదని బెదిరించడమేమిటని వారిని ఆమె ప్రశ్నించారు. పంచాయతీలో కుళాయి నీటిని విడుదల చేసే వ్యక్తితో పింఛన్లు పంపిణీ చేయించడమే కాకుండా ఇలా ప్రచారం చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పంచాయతీ కార్యదర్శి, ఇతర ఉద్యోగులు.. ఉన్నతాధికారులు చెప్పినట్టుగా చేస్తున్నామంటూ నీళ్లు నమలారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని జక్కంపూడి చెప్పారు. సీతానగరం మండలం, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, ఇనుగంటివారిపేట, ముగ్గళ్ల, కొండేపూడిలలో కూడా సిబ్బంది సామాజిక పింఛనుదార్లను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.చంద్రబాబు తరపున ప్రచారం చేస్తున్న వారికి పింఛన్ల పంపిణీ బాధ్యతలు ఎలా అప్పగించారని అధికారులను నిలదీశారు. ఈ విషయంపై రాజానగరం ఎంపీడీఓ ఎ.రాధాకృష్ణ మాట్లాడుతూ పాస్‌బుక్‌లు తీసుకోమని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. మండలంలోని ఇతర పంచాయతీ అధికారులను పిలిచి, పింఛన్ల పంపిణీని సక్రమంగా చేయమని ఆదేశించామన్నారు. ఎవరి నుంచి పాస్‌బుక్‌లు తీసుకోవడానికి వీలు లేదని చెప్పామన్నారు. 

రంపచోడవరం: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శులు బెదిరించి వారి పెన్షన్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పండా రామకృష్ణ, పార్టీ మండల కన్వీనర్‌ జల్లేపల్లి రామన్నదొర రంపచోడవరం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయానికి వారు వెళ్లి పింఛనుదారుల పుస్తకాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నారని పంచాయతీ కార్యదర్శి మూర్తిని నిలదీశారు. వాట్సాఫ్‌ గ్రూపులో మెసేజ్‌ ఆధారంగా పింఛనుదారుల పుస్తకాలు ఎలా స్వాదీనం చేసుకుంటారని ప్రశ్నించారు. మండలం మొత్తం కార్యదర్శులు పింఛనుదారుల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారని ఆర్‌ఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికి వేశారో మిషన్‌లో తెలిసిపోతుందని, టీడీపీకి ఓటు వేస్తే పెన్షన్‌ వస్తుందని, వేరే పార్టీకి వేస్తే పెన్షన్‌ రద్దు అవుతుందని బెదిరించారని నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. రంపచోడవరం గ్రామంలో గొట్టాలరేవుకు చెందిన చవలం లక్ష్మి పింఛన్‌ పుస్తకాన్ని పంచాయతీ సిబ్బంది తీసుకున్నారని ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేస్తే నీ పెన్షన్‌ ఇంతకు ముందులాగే వస్తుందని, ప్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తే పెన్షన్‌ రాదని ఆమెను వారు బెదిరించారన్నారు. మిగిలిన పెన్షన్‌దారుల పుస్తకాలతో పాటు తన పుస్తకాన్ని తిరిగి ఇప్పించాలనినామె ఫిర్యాదులో కోరారు. డీసీసీబి డైరెక్టర్‌ చాకలి నాగేశ్వరరావు, పార్టీ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు మంగా తమన్న కుమార్, జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాంజనేయులు, యూత్‌ అధ్యక్షుడు రాపాక సుధీర్, బొబ్బ శేఖర్, వీఎం కన్నబాబు,మాజీ సర్పంచులు మంగా బొజ్జయ్య, చిట్టెమ్మ,లక్ష్మి, పండా నాగన్నదొర తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top