కేసీఆర్ హత్యకు సుపారీ | Give money funded to kill kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ హత్యకు సుపారీ

Aug 7 2013 3:42 AM | Updated on Mar 25 2019 3:09 PM

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను హత్య చేసేందుకు సుపారీలు ఇచ్చినట్టుగా తమ వద్ద ఆధారాలున్నాయని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఉపనాయకుడు టి.హరీష్‌రావు వెల్లడించారు.

ఆయనకు జెడ్ ప్లస్ రక్షణ కల్పించాలి: హరీశ్, ఈటెల
 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను హత్య చేసేందుకు సుపారీలు ఇచ్చినట్టుగా తమ వద్ద ఆధారాలున్నాయని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఉపనాయకుడు టి.హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ సుపారీలు ఎవరిచ్చారో కూడా తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
 
  కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు అందిస్తామని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్‌కు హాని తలపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపుతామనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రక్షణకు ఇంటెలిజెన్స్ అదనపు డీజీని మూడు రోజుల క్రితమే కలిసినట్టు ఈటెల రాజేందర్ చెప్పారు. పనికిరాని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేసీఆర్‌కు కేటాయించారని, దానికి బదులుగా మరో వాహనాన్ని ఇవ్వాలని కోరినట్లుగా చెప్పారు.  
 
 ఎస్‌ఆర్‌సీలో చర్చ తరువాతే నిర్ణయం: ప్రస్తుతం జెడ్ కేటగిరీలోనున్న కేసీఆర్‌కు భద్రతను మరింత పెంచాలని కోరుతూ ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజీ మహేష్ భగవత్‌కు విన్నపం అందజేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని కోరా రు. దీనిపై భద్రత సమీక్ష కమిటీ(ఎస్‌ఆర్‌సీ)లో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.  
 
 జడ్ ప్లస్ కేటగిరీకి మారితే:రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రమే జెడ్ ప్లస్ భద్రత ఉంది. కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ సహాయ మంత్రి విద్యాసాగరావులకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట మంత్రులకు వై కేటగిరీ భద్రత ఉంది. కేసీఆర్‌కు జెడ్  కేటగిరీ కింద 6+2 సాయుధ రక్షకులు (గన్‌మెన్), బులెట్‌ప్రూఫ్ వాహనం, ఒక ఎస్కార్టు వాహనం, ఎస్కార్టు సిబ్బందితో పాటు ఆయన నివాసం వద్ద గార్డును ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీకి మారితే సాయుధ రక్షకుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement