పిక్నిక్‌లో విషాదం | girl killed on bee attack | Sakshi
Sakshi News home page

పిక్నిక్‌లో విషాదం

Dec 2 2018 7:04 AM | Updated on Dec 2 2018 7:04 AM

girl killed on bee attack - Sakshi

పొందూరు: పిక్నిక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. పొందూరు మండలం జాడపేటలో తేనెటీగలు దాడి చేసిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జాడపేట ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శనివారం సమీప తోటలో పిక్నిక్‌ జరుపుకొన్నారు. అందరూ సందడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేశాయి. అందరూ తలోవైపు పరుగులు తీశారు. అయితే బైరోతు అనూష(2) అనే రెండో తరగతి విద్యార్థిని మాత్రం తేనెటీగల నుంచి తప్పించుకోలేకపోయింది. ఒక్కసారిగా గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతిచెందింది. తేనెటీగల దాడిలో ముగ్గురు ఉపాధ్యాయులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.   

విషాదంలో తల్లిదండ్రులు..
బైరోలు అనూష స్వగ్రామం విజయనగరం జిల్లా కురుపాం గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మి, సింహాచలం వలస కూలీలు. తోటపని, ఇటుకల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా జాడపేటలో ఉంటున్నారు. అనూష ఇటీవలే గుండె జబ్బుతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆపరేషన్‌ చేశారు. ఆరోగ్యం కుదుటపడుతున్న సందర్భంలో తేనెటీగల దాడితో పాప భయభ్రాంతులకు గురై మృతి చెంది ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. 

రెండు గ్రామాల్లో విషాదం..
పొందూరు మండలంలోని జాడపేట, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వాండ్రంగిలో అనూష తాత కంది రమణ, అమ్మమ్మ విజయలక్ష్మి ఉంటున్నారు. మనవరాలు మృతి చెందిందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా, అనూష చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement