ఘనంగా గణనాథుని రథోత్సవం | Ganesh chariot festival celebrating in kanipakam | Sakshi
Sakshi News home page

ఘనంగా గణనాథుని రథోత్సవం

Sep 17 2013 3:52 AM | Updated on Sep 1 2017 10:46 PM

స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి రథో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి రథో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సర్వాలంకార భూషితుడైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో విశేష సమర్పణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకువచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. ఉభయదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందు భాగంలో అశ్వాలు, ఒంటెలు, వృషభాలు, సర్వసైన్యాధిపతులు నడవగా స్వామివారు రథంపై ఊరేగుతూ కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
 
భక్తులు రథంపై బొరుగు లు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కులు తీ ర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. రథోత్సవానికి దేవస్థానం వారు, కాకర్లవారిపల్లెకు చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకంకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు హరిప్రసాద్ రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పలు విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పూతలపట్టు ఎమ్మెల్యే రవి, ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ ఏఈవోలు ఎన్‌ఆర్.కృష్ణారెడ్డి, ఎస్‌వీ.కృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement