పోలీస్‌ 'స్పందన'కు మహిళల వందనం 

G-Files Governance Award for Prakasam District - Sakshi

ప్రతి వారం నిర్వహించే స్పందనకు 52 శాతం ఫిర్యాదులు మహిళల నుంచే.. 

ప్రకాశం జిల్లాకు జి–ఫైల్స్‌ గవర్నెన్స్‌ అవార్డు 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ పేరిట చేపట్టిన ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ ప్రత్యేక కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పోలీస్‌ శాఖ 90 శాతానికి పైగా పోలీస్‌ స్టేషన్లలో ‘స్పందన’ రిసెప్షన్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో స్వీకరించే ఫిర్యాదులను డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి వరకు పంపించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ‘స్పందన’ను ఆశ్రయిస్తున్న వారిలో 52 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. మహిళలకు మేలు చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల స్పందన లభిస్తుండగా.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు వస్తోంది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్న పోలీస్‌ శాఖకు ఇటీవల ‘స్కోచ్‌’ అవార్డు లభించింది. తాజాగా జి–ఫైల్స్‌ గవర్నెన్స్‌ అవార్డు–2019కు ‘స్పందన’ కార్యక్రమం ఎంపికైనట్టు రాష్ట్ర హోంశాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి. నేషనల్‌ పోలీస్‌ మిషన్‌(ఢిల్లీ)కి చెందిన బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌ అండ్‌ డీ) సంస్థ జి–ఫైల్స్‌ గవర్నెన్స్‌ అవార్డు అందించనుంది.  

ప్రకాశం జిల్లా పోలీస్‌కు ‘జి–ఫైల్స్‌ అవార్డు’ 
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖ ద్వారా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్‌ విభాగం ‘జి–ఫైల్స్‌ గవర్నెన్స్‌ అవార్డు–2019’ అందుకోనుంది. స్పందన–ప్రతిస్పందన అంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అనేక వినూత్న ఆవిష్కరణలు చేశారు. కార్యక్రమంలో పారదర్శకతను పెంచేందుకు అనేక అవగాహన కార్యక్రమాల ప్రోగ్రామ్‌లోని వీడియోలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి విస్తృతంగా ప్రచారం చేశారు. వాటిని 40 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు. 18 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేసుకున్న వీడియో కాన్ఫరెన్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా 40 లక్షల జనాభాతో ఆన్‌లైన్‌ లో మాట్లాడేలా ప్రకాశం జిల్లా పోలీసులు మంచి ప్రయత్నం చేశారు. 

‘స్పందన’ బియాండ్‌ బోర్డు ఏర్పాటు 
ప్రకాశం జిల్లాకు చెందిన వారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ సమస్య చెప్పుకునేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్‌తో స్పందన బియాండ్‌ బోర్డును నవంబర్‌ 25న ప్రారంభించారు. దీని ద్వారా యూఎస్, జర్మనీ, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, దుబాయ్, యుఏఈ, సింగపూర్‌ దేశాలతోపాటు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాల నుంచి ప్రజలు ‘స్పందన’ ద్వారా ప్రకాశం పోలీసు సేవలను ఉపయోగించుకోవడం విశేషం.  

ఒక్కో సమస్యకు 8.5 నిమిషాలే 
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కొక్క సమస్య పరిష్కారానికి సగటున 8.5 నిమిషాల సమయం పట్టింది. సోషల్‌ మీడియా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎస్సై నుంచి ఎస్పీ స్థాయి వరకు ప్రధాన కార్యాలయాలతో ప్రజలు నేరుగా ఇంటరాక్ట్‌ అయ్యేలా 84 టెర్మినల్స్‌ ఏర్పాటు చేశాం. మహిళలు పోలీస్‌ స్టేషన్లకు రావడానికి ఇష్టపడరు. కానీ వారు ‘స్పందన’ ద్వారా సహాయం పొందేందుకు ముందుకొస్తున్నారు.     – సిద్ధార్థ్‌ కౌశల్, ప్రకాశం జిల్లా ఎస్పీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top