వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు.
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఆయన సోమవారం సాయంత్రం రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి క్వారీ మార్కెట్ సెంటర్‌లో జరిగే ‘వైఎస్సార్ జనభేరి’ సభలో పాల్గొంటారు.
రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని అన్ని డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తలపడుతున్నారు. ఇప్పటికే మండపేటలో ఒకరు, అమలాపురంలో మరొకరు వైఎస్సార్ సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై విజయదుందుభి మోగించడంతో జిల్లా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని సుస్పష్టమవుతోంది. రాజమండ్రి సహా అన్ని చోట్లా గెలుపు బావుటా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన అనంతరం ఇతర పార్టీల అగ్రనాయకుల కన్నా ముందుగా జగన్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి రానుండడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మోముల్లో అప్పుడే విజయ దరహాసం చిగురిస్తోంది. మున్సిపోల్స్‌లో సాధించే విజయాల స్ఫూర్తితో ఆ వెంటనే జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ జయభేరి మోగిస్తామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గత నాలుగున్నరేళ్లుగా జగన్‌కు అండగా నిలిచిన జిల్లావాసులు ఈ కీలక సమయంలోనూ ఆయన వెంటే ఉంటారని, ప్రజాసమస్యలపై గత నాలుగేళ్లుగా అలుపెరగని పోరు సాగిస్తున్న ఆయన నాయకత్వాన్నే కోరుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు. ఆయన జిల్లాకు ఎప్పుడు వచ్చినా బ్రహ్మరథం పట్టడమే అందుకు తార్కాణమంటున్నారు. కాగా జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి రోడ్ షోలు సాగే రూట్ మ్యాప్‌ను పార్టీ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదివారం అమలాపురంలో పరిశీలించారు.