నేటి నుంచి ఉచిత రేషన్‌  | Free ration third installment from 29th April | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఉచిత రేషన్‌ 

Apr 29 2020 4:14 AM | Updated on Apr 29 2020 8:01 AM

Free ration third installment from 29th April - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ చేయగా బుధవారం నుంచి వచ్చే నెల 10 వరకు మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకులను అందించనుంది. ఈసారి మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేశారు. ఈసారి కూడా రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే సరుకులు రేషన్‌ షాపులకు చేరుకున్నాయి. 

► రెండో విడత సరుకుల పంపిణీ వరకు రాష్ట్రంలో 1,47,24,016 తెల్ల రేషన్‌ కార్డులున్నాయి. 
► బియ్యం కార్డుల కోసం ‘స్పందన’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 
► వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అందులో 81,862 మందిని అర్హులుగా తేల్చారు. 
► ప్రస్తుతం మూడో విడత సరుకులు తీసుకునేందుకు మొత్తం 1,48,05,878 మందిని అర్హులుగా తేల్చినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. 
► ఈ దఫా ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి. 
► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారుల చొప్పున టైమ్‌స్లాట్‌ విధానంలో టోకెన్లు పంపిణీ చేశారు. 
► అన్ని రేషన్‌ షాపులు, అదనపు కౌంటర్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, నీళ్లు అందుబాటులో ఉంచారు. 
► రేషన్‌ కార్డులు ఎక్కువ ఉన్న రేషన్‌ షాపులకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. 
► పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ తీసుకుంటున్న కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే సరుకులు తీసుకునేందుకు వీలు కల్పించారు.   
► రేషన్‌ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 
► 28,354 రేషన్‌ షాపులు, 15,331 అదనపు కౌంటర్లు కలిపి 43,685 చోట్ల లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేయనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి 
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 
గుడివాడ: మూడో విడత కింద ఉచిత రేషన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యం, కందిపప్పును పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా కార్డుల కోసం 95 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ కూడా రేషన్‌ సరుకులను ఉచితంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రేషన్‌ కార్డు లేకపోయినా వీఆర్వోల ద్వారా రేషన్‌ సరుకులు ఇవ్వాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement