బడుగుల నెత్తిన పిడుగు

Four Members Died In Thunderbolt At Prakasam District - Sakshi

పిడుగు పాటుకు నలుగురు మృతి

మిరపనాటుకు వెళ్లి పేర్నమిట్టకు చెందిన ఇద్దరు కూలీలు బలి

వెలిగండ్ల మండలంలో సజ్జ కోతకు వెళ్లి మరో మహిళ..

ఇంకొల్లు మండలంలో అరక తోలుతున్న రైతన్న..

జిల్లాలో వేర్వేరు చోట్ల ఘటనలు

చీమకుర్తి: రెక్కాడితేగాని డొక్కడని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులకు వెళ్లిన విగతజీవులుగా మారారు. జిల్లాలో సోమవారం మధ్యాహ్నం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో పిడుగుపాటుకు ఓ రైతుతో పాటు మరో ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరి కొందరు ఆధాటికి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన 11 మంది మహిళా కూలీలు సోమవారం ఉదయం పొరుగూరు మంగమూరులోని పొలాల్లో మిరప నాట్లు కోసం వెళ్లారు. అప్పటి దాకా నాట్లు వేసిన వారంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు పొలంలోనున్న జమ్మిచెట్టు కిందకు చేరారు. అందరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. అప్పటికే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులుతో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా వర్షం వంగకపోవడంతో మళ్లీ నాట్లకు ఉపక్రమించే  చెట్టు కింద నుంచి అందరు చేలోకి బయలుదేరారు. అంతలోనే జమ్మి చెట్టు మొదలును చీల్చుకుంటూ పెద్ద శబ్దంతో పిడుగు పడింది. చెట్టు మొదలుకు దగ్గరగా ఉన్న తొండపురెడ్డి కోటేశ్వరమ్మ(33), ఆమెకు పక్కనే ఉన్న మారెళ్ళ శేషమ్మ(65) కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన 9 మంది పిడుగు శబ్దానికి స్ప్రహతప్పి పడిపోయారు. వారు తేరుకొని లేచి చూసేసరికి కోటేశ్వరమ్మ, శేషమ్మ విగత జీవులుగా పడి ఉన్నారు. చెట్టు కింద నుంచి ఒక్క క్షణం ముందు బయటకు వచ్చి ఉంటే వారిద్దరూ కూడా ప్రాణాలతో ఇంటికి వచ్చేవారని తోటి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

పేర్నమిట్టలో విషాదం..
పిడుగు పాటుకు మృతి చెందిన కోటేశ్వరమ్మ, శేష మ్మ ఇద్దరివీ పేద కుటుం బాలకు చెందిన వారే. భర్తలతో కలిసి కూలి పనులు చేసుకుంటేనే వారికి జీవనం గడిచేది. కోటేశ్వరమ్మకు భర్త రవిరెడ్డి, 15 ఏళ్ల కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి, 12 ఏళ్ల కుమార్తె శ్రీజ ఉన్నారు. శేషమ్మకు భర్త నారయ్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతిచెందిన ఇద్దరుతో పాటు మిగిలిన 9 మంది కూడా పేర్నమిట్ట గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదాఛాయలు అలముకున్నాయి. పిడుగు పడిన ప్రాంతాన్ని ఒంగోలు తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై భవానీ, తహసీల్దార్‌ ఎం.రాజ్‌కుమార్, ఎంపీడీఓ వై.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పరిశీలించారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఆదుకుంటుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు హామీ ఇచ్చారు.  

అరక దున్నుతూ.. 
ఇంకొల్లు : కారంచేడు మండలం దగ్గుబాడుకు చెందిన రావి మనోహర్‌ (55) కొంత కాలంగా ఇంకొల్లులో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం అరక తోలేందుకు సమీపంలలోని హనుమోజిపాలెం వెళ్లాడు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడటంతో పొలంలోనే మనోహర్‌ ప్రాణాలు విడిచాడు. పిడుగు ధాటికి ఎడ్లు బెదిరిపారిపోయాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృత దేహాన్ని స్వగ్రామం దగ్గుబాడుకు తరలించారు. గేదెలను మేపుకునేందుకు పొలానికి వెళ్లిన హనుమోజిపాలెం గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరమ్మ అదే సమయంలో పిడుగుపాటుకు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె మేపుతున్న ఓ పాడి గేదె మృతి చెందింది. గమనించిన స్థానికులు కోటేశ్వరమ్మను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  


హనుమోజిపాలెంలో అరక తోలుతూ పిడుగుపాటుకు మృతి చెందిన రైతు మనోహర్‌

పాపిరెడ్డిపల్లిలో మరో మహిళ..
వెలిగండ్ల: వెలిగండ్ల మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఆ గ్రామానికి చెందిన కొందరు మహిళా కూలీలు సజ్జ కోసేందుకు గ్రామం సమీపంలోని పొలానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘావృతం అయింది. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగుపడి పడింది. పొలంలో గడ్డికోస్తున్న సోము రమణమ్మ(50) పిడుగుపాటుకు కుప్ప కూలిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరు మహిళలు మేడం పద్మ, డేగా వరమ్మలు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వారిద్దరినీ చికిత్స కోసం కనిగిరికి తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top