
సాక్షి, విజయవాడ : విజయవాడలోని నున్న, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం ఉదయం విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నున్నలో జరిగిన దుర్ఘటనలో కార్తీక దీపాలను వెలిగించేందుకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు మంగళాపురం కాలువలో పడిపోయారు. స్థానికులు తల్లిని రక్షించగా.. కూతురు శ్వేత నీటిలో కొట్టుకుపోయింది.
కృష్ణా నదిలో కార్తీక స్నానాలకు వెళ్లిన అత్తా, కోడళ్లు గల్లంతయ్యారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో అత్తా కోడళ్లైన బ్రాహ్మణి, అన్నపూర్ణలు స్నానాలు చేసేందుకు కృష్ణా నదికి వెళ్లారు. అయితే.. ప్రమాదవశాత్తూ వారు నదిలో గల్లంతు కాగా వీరిలో అత‍్త మృతదేహం లభ్యమైంది. గల్లంతైన బ్రాహ్మణి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా... వారం రోజుల క్రితం కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.