
దాడి... నాలుగు బైకుల దహనం
వంజరి పంచాయతీ కేంద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తాజంగి వైపు వెళ్తున్న వాహనచోదకులపై దాడి చేసి వారు ప్రయాణిస్తున్న నాలుగు బైకుల ను కాల్చి బూడిద చేశారు.
- వంజరి సమీపంలో సంఘటన
- అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తుల ఆగడం
- నిందితులు గంజాయి సరఫరాదారులు?
జి.మాడుగుల, న్యూస్‌లైన్ : వంజరి పంచాయతీ కేంద్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తాజంగి వైపు వెళ్తున్న వాహనచోదకులపై దాడి చేసి వారు ప్రయాణిస్తున్న నాలుగు బైకుల ను కాల్చి బూడిద చేశారు. వంజరి-తాజంగి-గెమ్మెలి మూడురోడ్ల కూడలి వద్ద మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వంజరి, గెమ్మెల పంచాయతీల్లో వివిధ గ్రామాల ప్రజలు గంజాయి తరలించేందుకు ఎరుపు రంగు పికప్ వాహనంలో గంజాయి మూటలు లోడు చేస్తుండగా, నాలుగు బైక్‌లపై ఆరుగురు వ్యక్తులు వచ్చి డబ్బులిమ్మని డిమాండ్ చేయటంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే కొండపై ఉన్న కొందరు గంజాయి వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు.
డబ్బులిమ్మని డిమాండ్ చేసిన వారిపై దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలవగా అయిదుగురు పరారయ్యారు. వారు వదిలి వెళ్లిన నాలుగు బైకులపై పెట్రోల్ పోసి దహనం చేశారు. రోడ్డుపై పెద్దపెద్ద రాళ్లు, కర్రలు, చెప్పులు చిందర వందరగా పడి ఉన్నాయి. వాహనాల యజమానులు చింతపల్లి మండలం తాజంగి గ్రామస్తులని తెలిసింది. గంజాయి రవాణాదారులు ఏ గ్రామస్తులో తెలియరాలేదు.
జి.మాడుగుల-వంజరి-తాజంగి, నర్సీపట్నం వెళ్లేందుకు రాత్రి సమయాల్లో ప్రయాణించే వారిపై కొందరు దాడి చేసి సొమ్ము, వాహనాలు అపహరించేందుకు చేసిన ప్రయత్నం కూడా కావచ్చని స్థానికులు భావిస్తున్నారు. గ్రామస్తుల కథనం మరోలా ఉంది. జి.మాడుగుల రోడ్డు నుంచి తాజంగి వైపు వెళ్తున్న బైకులకు అడ్డంగా కొందరు పెద్ద కర్రను పెట్టారు. దీంతో కింద పడిపోయిన వారిపై కొందరు దాడి చేస్తుండగా, మరో మూడు బైక్‌లపై అయిదుగురు వచ్చి వారించారు.
ఇదే సమయంలో పది మంది వరకు వచ్చి అందరిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. బాధితుల్లో ఒకరు తప్పించుకుని వంజరి గ్రామం చేరుకుని గ్రామస్తులకు వివరించాడు. గ్రామస్తులను సంఘటన స్థలానికి తీసుకెళ్లేసరికే నాలుగు బైకులను పోగుచేసి నిప్పంటించి గెమ్మెలి గ్రామం వైపు వెళ్లిపోయారు.