లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై తర్జనభర్జనలు పడి ఖరీఫ్ సీజన్‌కు బ్యాంకర్లు అమలు చేశారు. నిబంధనల ప్రకారం సీజన్‌తో సంబంధం లేకుండా రైతులందరికీ దీనిని వర్తింపజేయాలి. అయితే ఇక్కడే బ్యాంకర్లు తిరకాసు పెడుతున్నారు. రబీసీజన్‌కు సంబంధించి అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి బ్యాంకర్ల నిబంధనల ప్రకారం రబీ సీజన్ మొదలైంది.
ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు, పెద్దశెట్టిపల్లె, దొరసానిపల్లె, రేగుళ్లపల్లె, తాళ్లమాపురం, ఎర్రగుంట్లపల్లె, రంగసాయిపురం, కొత్తపేట, నంగనూరుపల్లె, కాకిరేనిపల్లె, శంకరాపురం, నరసింహాపురం, చౌటపల్లె, సీతంపల్లె, సోములవారిపల్లె, బొల్లవరం గ్రామాలతోపాటు ప్రొద్దుటూరులోని 36, 38 వార్డులు కూడా ఎస్‌బీఐ వ్యవసాయాభివృధ్ది బ్యాంకు పరిధిలో ఉన్నాయి. పట్టణంలో వ్యవసాయాభివృద్ధి శాఖ ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ బ్యాంక్ పరిధిలో సుమారు 6వేల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటున్నారు.
ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ కే భూషణంను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మాత్రమే ఆదేశాలు వచ్చాయని తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి మళ్లీ ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. కడపలోని బ్యాంక్ రీజినల్ కార్యాలయం అధికారులను వివరణ కోరగా ఇదే విషయాన్ని తెలిపారు. జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ వీరారెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.