ఆశల బడ్జెట్ | Formal budget | Sakshi
Sakshi News home page

ఆశల బడ్జెట్

Mar 12 2015 1:50 AM | Updated on Aug 24 2018 2:36 PM

కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించని నేపథ్యంలో గురువారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించని నేపథ్యంలో గురువారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. డెల్టా ఆధునీకరణకు, పులిచింతల పూర్తికి, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి, తాగునీటి సమస్య పరిష్కారానికి, రాజధాని నిర్మాణ క్రమంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే రాజధాని జిల్లా కేంద్రం గుంటూరు నగరంపై ప్రత్యేక వరాలు కురిపించాలని కోరుకుం టున్నారు.
 
  సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్నింటికైనా  నిధులు కేటాయిస్తారని ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాటి ప్రాధాన్యం లభించలేదు. శాసనసభలో గురువారం ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో ముఖ్యంగా సాగు, తాగునీరు ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సి ఉంది. వ్యవసాయం, వాణిజ్యరంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులు నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా డెల్టా ఆధునీకరణ పనులు రెండేళ్ల నుంచి ముందుకు కదలడం లేదు. పులిచింతల ప్రాజెక్టు విషయంలోనూ ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో ఉన్న గుంటూరు ప్రజల తాగునీరు, మురుగునీటి పారుదల, రహదారుల నిర్మాణాలు, మరమ్మతులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం ఉంది.
 
 డెల్టా ఆధునీకరణకు సంబంధించి రెండేళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలతో చర్చలు జరిపింది. కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ధరలు చెల్లిస్తే పనులు తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థలు చెప్పుకొచ్చాయి. ఈ పనులన్నీ తిరిగి ప్రారంభం కావాలంటే అదనంగా రూ.1500 కోట్ల వరకు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
 గతంలో  చెల్లించాల్సిన బకాయిలు, అదనంగా విడుదల కావాల్సిన నిధులతో మొత్తం ఈ రంగానికి రూ.3000 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన నిర్మాణ పనులు, ముంపు గ్రామాల బాధితులకు పునరావాస చర్యల నిమిత్తం రూ.2 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తుళ్లూరు కేంద్రంగా నిర్మితం కానున్న రాజధానికి అనుబంధంగా ఉండే గ్రామాల నుంచి రహదారులు, రవాణా సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రహదారుల విస్తరణ, విద్యుత్ సౌకర్యం, గ్రామాలకు రక్షిత మంచినీటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఒక్కటే రూ. 500 కోట్ల వరకు నిధులు కేటాయించాలని కోరింది.
 
 నూతన రాజధాని జిల్లా కేంద్రంగా ఉన్న గుంటూరు నగరం అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ హయాంలో నగరంలో ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప కింద మొత్తం 3,100 మందికి సొంతిళ్లు సమకూర్చారు. ఇటీవల రాజీవ్ గృహకల్ప పథకానికి 22 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కరికి కూడా గృహనిర్మాణం చేపట్టలేదు. సొంతింటి కలను నిజం చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
 
 నగరంలో ప్రధాన, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కేవలం 40శాతం మాత్రమే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థఉంది. 1300 కిలోమీటర్ల పక్కా డ్రైన్లు, 700 కిలోమీటర్ల కచ్చా డ్రైన్లు ఉన్నాయి.  నగరం నుంచి నీరు బయటకు వెళ్లే ప్రధాన డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి, వరదనీటి పారుదలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
 
 నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధాన రహదారుల విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అరండల్‌పేట ఫ్లైఓవర్‌బ్రిడ్జి విస్తరిస్తే కొంత ఫలితం ఉంటుంది.  రైల్వేక్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో త్వరగా ఆర్‌ఓబి, ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లుగా అదిగోఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement