పెరిగిన వడి... మళ్లీ అలజడి 

Flood Water Flow Again Increased In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి :  గోదావరి ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ  పెరిగి భయపెడుతోంది. ఇళ్ల చుట్టూ చేరిన వరద నీరు బుధవారం నాటికి మూడు నుంచి నాలుగు అడుగులు లాగేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు పునరావాస చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో వరద ముంపు, తీసుకుంటున్న పునరావాస చర్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు మంత్రుల బృందాన్ని ఏజెన్సీ దేవీపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించేలా చేసి బాధితులకు భరోసా నింపేలా చేశారు. ఇంతలోనే బుధవారం సాయంత్రానికి మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

కాఫర్‌ డ్యామ్‌తో ఎదురైన ముంపు, పోలవరం పునరావాస ప్యాకేజీపై గత చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో నిర్వాసితుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు సీఎం ఆదేశాల మేరకు భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం ఏజెన్సీలోని ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని మంత్రి వారికి చెప్పి వెళ్లారు. మరోపక్క ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసరాలను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తున్నారు.

నష్టం రూ.5.53 కోట్లుగా అంచనా
ప్రాథమికంగా జిల్లాలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం రూ.5.53 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 
⇔ ముమ్మిడివరం నియోజకవర్గం లంక ఆఫ్‌ ఠాణేల్లంక, గురజాపులంక, కేశనకుర్రు శివారు పొగాకులంక తదితర ప్రాంతాల్లో ముంపు నుంచి బయటపడటంతో ఉపశమనం పొందుతున్నారు.  
 గురజాపులంకలో బెండ, ఆనప, వంగ తోటలు ముంపుతో తీవ్రంగా నష్టపోవడం కనిపించింది. గోదావరి ప్రవాహ వేగానికి సుమారు 50 ఎకరాల ముమ్మిడివరం మండలంలోని లంక భూములు కోతకు గురయ్యాయి. 
రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం తొర్రేడు, కోలమూరు తదితర గ్రామాల్లోని పంటలు ముంపులోనే ఉన్నాయి. కపిలేశ్వరపురం మండలంలో సుమారు 390 ఎకరాల్లో కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు ముంపుతో దెబ్బతిన్నాయి. 
⇔ రాజోలు నియోజక వర్గంలో సుమారు వెయ్యికి పైగా ఇళ్లు ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ  నియోజకవర్గంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి చేలు వరద ముంపులో నానుతున్నాయి. 
 కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో అరటి, కంద, పసుపు, బొప్పాయి పంటలతో పాటు పశుగ్రాసం వరదనీటిలో మునిగాయి. 
 అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలో వరద ముంపులో  40ఇళ్లు ఉన్నాయి. పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 60 ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి. 
 పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ కూడా నాటుపడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి కనిపించింది. మానేపల్లి శివారు చివాయిలంక ప్రజలు నడుంలోతు నీటిలో ప్రయాణం సాగిస్తున్నారు.

ముంపులో కాజ్‌వేలు...
పాశర్లపూడి ఏటిగట్టు దిగువన జల దిగ్బంధంలో ఉన్న కాజ్‌వే నుంచి రాకపోకలు పునరుద్ధరించారు. ఇదే మండలం కొర్లగుంట ఏటిగట్టు దిగువన కాజ్‌వేపై ఎనిమిదో రోజు కూడా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ముక్తేశ్వరం–అయినవిల్లిలంక గ్రామాల మధ్య ఎదురుబిడిం కాజ్‌వేపై ఇంకా రెండడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. పడవల రాకపోకలు నిలుపుదల చేశారు.. ఏజెన్సీలో దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఎనిమిది రోజులైనా ఇప్పటికీ రవాణా సౌకర్యాలు పునరుద్ధరించ లేదు. మంత్రులు వచ్చి వెళ్లాక ఏజెన్సీలో సహాయక చర్యలు మాత్రం సక్రమంగానే సాగుతున్నాయి. భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరుకోవడం, శబరి నది ఉధృతి ఎక్కువగా ఉండటంతో దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంకా వరద ముంపు కొనసాగుతోంది.

మంగళవారం నాలుగు అడుగులు తగ్గిన వరద బుధవారం సాయంత్రం మరో అడుగు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాంతాల్లో ముంపు కాస్త తగ్గినా ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. వారం రోజులుగా సుమారు 4,500 కుటుంబాలు ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం  కాటన్‌ బ్యారేజీ వద్ద బుధవారం వరద ముంపు తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ స్వల్ప పెరుగుదల నమోదవడంపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎగువన మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న ప్రభావంతో వరద మరోసారి పెరిగేందుకు అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అభిప్రాయపడుతోంది.

ఉద్యానవన పంటలకు అపార నష్టం...
జిల్లాలో 2510 హెక్టార్లలో ఉద్యావన పంటలు నీట మునిగాయని ప్రాథమికంగా జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పొలవరం, మామిడికుదురు, పి. గన్నవరం, కె గంగవరం మండలాల్లో రూ.2.45 కోట్లు మేర 1563 హెక్టార్లలో కూరగాయలకు, రూ.2.17 కోట్ల మేర 708 హెక్టార్లలో అరటి, రూ.19 లక్షల మేర 104 హెక్టార్లలో బొప్పాయి, రూ.60 లక్షల మేర 80 హెక్టార్లలో తమలపాకులకు, రూ.4.50 లక్షల మేర 30 హెక్టార్లలో పసుపునకు, రూ.7.15 లక్షల మేర 25 హెక్టార్లలో పువ్వులతోటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి కాకుండా మరో 4వేల 377 హెక్టార్లలో వరి పంటకు నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా.

సహాయ చర్యలు
ముంపునకు గురైన ప్రాంతాల్లో వరద బాధితుల కోసం 104 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 43 వేల 293 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వరద బాధితుల కోసం రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్, బృందాలు పనిచేస్తున్నాయి. నాలుగు లాంచీలతోపాటు, మరపడవలను వినియోగిస్తున్నారు. 

ఉరకలేస్తున్న గోదారమ్మ
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్‌): కాటన్‌బ్యారేజీ వద్ద గోదారమ్మ ఉరకలేస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు 11.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ ఉదయం 11 గంటలకు 11.75 అడుగులకు చేరుకోవడంతో తిరిగి మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అక్కడ నుంచి మరింత పెరుగుతూ రాత్రి 7 గంటలకు 12.20 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. కాటన్‌ బ్యారేజీ నుంచి 10,45,343 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు.

గోదావరి జలాలు నిలిపివేత
సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేశామని జలవనరులశాఖ డీఈ వెంకట్రావు తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బురద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పై అధికారుల సూచనలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాల విడుదల నిలిపివేశామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top