మార్కాపురం అభ్యర్థికి గ్రూప్‌–1లో ఫస్ట్‌ ర్యాంక్‌ 

First rank in Group-1 for Marakapuram candidate - Sakshi

మార్కాపురం/రాచర్ల/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/దాచేపల్లి (గురజాల): 2011 గ్రూప్‌– 1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 489.5 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఆకుల వెంకటరమణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రమణ బీటెక్‌ చదివేటప్పుడే తండ్రి శ్రీరాములు మృతి చెందగా, తల్లి లక్ష్మీనరసమ్మ రెండేళ్ల కిందట మరణించింది. ప్రస్తుతం రమణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఇదే జిల్లా గిద్దలూరు మండలం సూరేపల్లెకు చెందిన ఖాజావలి బీసీ–ఈ కేటగిరీలో మొదటి ర్యాంక్‌ సాధించారు. ప్రస్తుతం ఆయన జిల్లాలోని రాచర్ల మండలం ఆకవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.  

మహిళల విభాగంలో రెండో ర్యాంక్‌ శైలజ సొంతం 
గ్రూప్‌–1 (2011) పరీక్ష ఫలితాల్లో 434 మార్కులు సాధించి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన దామరచర్ల శైలజ మహిళల విభాగంలో రెండో ర్యాంక్, జనరల్‌ విభాగంలో 15వ ర్యాంక్‌ సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పెదయలమంద, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె అయిన శైలజ తండ్రి 11 ఏళ్ల కిందట మరణించడంతో తల్లి కష్టపడి చదివించింది. కాగా.. శైలజ భర్త డాక్టర్‌ రాజేంద్ర ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.  

మహిళల్లో మొదటి ర్యాంకర్‌ హేమలత
శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామ శివారు కనుగులవానిపేటకు చెందిన కనుగుల హేమలత 470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్, మహిళా విభాగంలో మొదటి ర్యాంక్‌ పొందారు. ప్రస్తుతం ఆమె విజయనగరం జిల్లా పార్వతీపురంలో పంచాయతీరాజ్‌ విభాగం డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె విజయంతో తల్లిదండ్రులు ప్రసాదరావు, సుజాత స్వీట్స్‌ పంచి ఆనందం వ్యక్తం చేశారు. ప్రసాదరావుది వ్యవసాయ కుటుంబమే అయినా హేమలతతోపాటు మిగతా ఇద్దరు పిల్లలను ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రోత్సహించారు. పెద్ద కుమార్తె హైమావతి ఆముదాలవలసలో టీచర్‌గా, కుమారుడు జగదీశ్వరరావు తెలంగాణ జలవనరుల శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హేమలత భర్త కె.తవిటినాయుడు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్‌లో రేంజ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top