ఒంటికి నిప్పంటుకుని మహిళ మృతి | fire pee the death of the woman | Sakshi
Sakshi News home page

ఒంటికి నిప్పంటుకుని మహిళ మృతి

Mar 15 2016 12:15 AM | Updated on Jul 29 2019 6:59 PM

కట్టెల పొయ్యిలోని మంటలు ఒక్కసారిగా రేగి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి .........

కుమారుడి వివాహానికి వచ్చి దుర్ఘటన పాలు
పెళ్ళింట అలుముకున్న విషాదం

 
గుంటూరు రూరల్ : కట్టెల పొయ్యిలోని మంటలు ఒక్కసారిగా రేగి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం నగరంలో చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రి ఔట్ పోస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తియ్యగూర సుజాత(42) సినిమాల్లో అసిస్టెంట్ మేకప్ ఉమన్‌గా పనిచేస్తుంటుంది. ఈనెల 11న తన పెద్దకుమారుడు మాధవరెడ్డి వివాహం నిమిత్తం హౌసింగ్ బోర్డ్‌లోని తన తండ్రి పాములరెడ్డి ఇంటిలో వివాహం జరిపించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. 11న వెనిగళ్ళలో వివాహం పూర్తవగా, ఆదివారం హౌసింగ్ బోర్డ్‌లో సత్యనారాయణ వ్రతం జరిపారు.

వెనిగళ్లలోని పెళ్లికూతురు ఇంటికి వెళ్లేందుకు సోమవారం ఉదయం బయలుదేరే క్రమంలో బంధువులకు నీళ్లు కాగబెట్టేందుకు సుజాత ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసింది. పొయ్యిలో కిరోసిన్ పోసి, పక్కన గోడపై ఉన్న కట్టెలను తీస్తుండగా, ఒక్కసారిగా కట్టెలు పొయ్యి పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బా పడ్డాయి. దీంతో కిరోసిన్ మొత్తం పొయ్యిలో ఒలికిపోయి ఒక్కసారిగా మంటలు లేచి సుజాత చీరకు అంటుకున్నాయి. 

మంటలనుంచి తప్పించుకునే ప్రయత్నంలో సుజాత పొయ్యిలో పడిపోవడం గమనించి కొడుకు మాధవరెడ్డి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సుజాత శరీరం వెనుకభాగం 40 శాతం కాలిపోయింది. వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి  చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాధితురాలి బంధువులు ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు కొడుకు మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement