గ్లాస్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

fire accident In Glass house at Srikakulam - Sakshi

మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన షాపు యజమాని, వర్కర్లు

 భారీ శబ్దాలతో ఉలిక్కిపడిన రాజాం పట్టణవాసులు  

రాజాం సిటీ: పట్టణంలోని శ్రీనివాస కాంప్లెక్స్‌ వద్ద గ్లాస్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షాపు యజమాని, ఇద్దరు వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాంలోని శ్రీనివాస థియేటర్‌ రోడ్డులో శ్రీనివాస కాంప్లెక్స్‌లో సాయిరాం గ్లాస్‌హౌస్‌ను రాజాంకు చెందిన బూరాడ బాలకృష్ణ నడుపుతున్నారు. ఈ షాపులో అన్ని రకాల ప్లేవుడ్, హార్డ్‌వేర్, పెయింటింగ్‌ సామగ్రి, గ్లాస్‌ వస్తువులు విక్రయిస్తుంటారు. ఆర్డర్ల ప్రకారం కొత్తవస్తువులను గాజుతో తయారుచేస్తుంటారు. శనివారం రాత్రి షాపు యజమానితోపాటు వర్కర్లు పైల రామ్మోహన్, పైల జగన్నాథలు షాపు షట్టర్లు వేసి లోపల పనిలో నిమగ్నమయ్యారు. రాత్రి రెండు గంటల తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి దాటిన సమయం కావడంతో ప్రమాద తీవ్రతను ఇతరులు గుర్తించలేకపోయారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు బయటకు రాలేక ఆర్తనాదాలు పెట్టారు. 

ఓ వైపు మంటలు అధికమవడంతో గ్లాస్‌ సామగ్రి, పెయింటింగ్‌ సామగ్రి కాలిపోయి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మూసి ఉన్న షట్టరు ఎగిరిపడి ఎదురుగా మరోషాపు షట్టర్‌ను బలంగా ఢీకొట్టింది. భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కలవారు భయభ్రాంతులకు గురయ్యారు. కాసేపటికి తేరుకొని శ్రీనివాస కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించి అక్కడకు చేరుకున్నారు. ఇంతలో షాపులో ఉన్న బాధితులు బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే బాధితులు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. బయటకు వస్తూనే వీరు 108 వాహనానికి, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సపర్యలు చేయడంతోపాటు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత 108 అంబులెన్సులో బాధితులను రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నా పూర్తి వివరాలు మాత్రం బయట పడలేదు. ఈ ఘటనలో రూ. 20 లక్షలు మేర ఆస్తినష్టం ఉంటుందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. ప్రమాదానికి గురైన ముగ్గురూ స్థానికంగానే నివాసం ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ సుగుణాకరరావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top