సముద్రంలో చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం 

Financial Assistance for Promoting Fishing at Sea - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీలి విప్లవం పథకం కింద సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి పలు విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మత్స్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సాంప్రదాయిక చేపల పడవలను ఆధునీకరించుకోవడానికి, మత్స్యకారులకు సేఫ్టీ కిట్స్‌ పంపిణీ చేయడానికి, ఫైబర్‌ గ్లాస్‌ ప్లాస్టిక్‌ బోట్లు, ఇన్సులేటెడ్‌ ఐస్‌ బాక్స్‌లు సమకూర్చుకోవడానికి, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడానికి, మత్స్యకారులు సముద్ర జలాల్లో సుదూరంగా వేటను కొనసాగించడానికి ట్రాలర్లను లాంగ్‌లైనర్స్‌ కింద మార్చుకోవడం వంటి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తీర ప్రాంత భద్రతను పటిష్టపరచేందుకు ఏర్పాటైన జాతీయ కమిటీ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తుందని చెప్పారు. 

కూలీల వేతన సవరణకు కొత్త ప్రాతిపదిక 
మహాత్మాగాంధీ నరేగాలో కూలీలకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు ఇచ్చేందుకుగాను.. వినియోగదారుల ధరల సూచి–రూరల్‌ ఆధారంగా వేతనాలను సవరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచి (వ్యవసాయ కార్మికులు)ని ప్రాతిపదికగా తీసుకుంటున్నామని, అయితే సంబంధిత కమిటీ చేసిన తాజా సిఫారసును ఆర్థిక శాఖ సహా ఇతర శాఖలు పరిశీలిస్తున్నాయని వివరించారు. 

3 జిల్లాల్లోని 24 బ్లాక్‌లకు మహిళా శక్తి కేంద్ర నిధులు 
కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా శక్తి కేంద్ర (ఎంఎస్‌కే) స్కీమ్‌ ద్వారా మహిళా సాధికారత కోసం ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, వైఎస్సార్‌ జిల్లాల్లోని 24 బ్లాకులకు నిధులు విడుదల చేసినట్టు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో మంత్రి సమాధానం ఇచ్చారు.
 
ఆయుష్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు 
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆయుష్‌ డిస్పెన్సరీలు, సబ్‌ హెల్త్‌ సెంటర్లను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ఆయుష్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను నెలకొల్పనున్నట్లు కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ లోక్‌సభకు తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, డాక్టర్‌ బి. వెంకటసత్యవతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీ నుంచి ఈ తరహా ప్రతిపాదనలు 42 రాగా రూ. 3.87 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.  

మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదు 
నల్లమల రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో రేడియో ధార్మికత వెలువరించే ఎటువంటి మెటీరియల్‌ తవ్వకాలకూ అనుమతి ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఒకవేళ అనుమతి ఇస్తే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ భూములు నష్టపోయిన మేరకు పరిహారంగా అటవీయేతర భూములను, లేదా రెట్టింపు డీగ్రేడ్‌ అటవీ భూములను తీసుకుంటామని స్పష్టం చేశారు. 

పశుగ్రాసంగా వినియోగించండి 
దేశంలో పశుగ్రాసం, ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నందున వరి గడ్డిని పొలాల్లో కాల్చకుండా పశువులకు గ్రాసంగా, ఎరువుగా వినియోగించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కేంద్రానికి సూచించారు. 193 నిబంధన కింద ‘వాయు కాలుష్యం’పై  లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పంట వ్యర్థాల నిర్వహణ ద్వారా విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాలుష్య నియంత్రణ మండళ్లు నామమాత్రంగా ఉన్నాయని, వాటి పనితీరు మెరుగుపరచాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top