పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మన్నుకొట్టే ప్రయత్నాలను
పాలకొల్లు :పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మన్నుకొట్టే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తే దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయప్రాజెక్టుగా ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు రూ.ఐదువేల కోట్లు ఖర్చుచేయగా దానిని ఎవరి ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల మూడువేల టీఎంసీల నీరు సముద్రంలో కలవకుండా అనేక రాష్ట్రాలకు ఉపయోగపడుతుందన్నారు. వంతులవారీ విధానంతో అనేక అవస్థలు పడుతూ వేలాది ఎకరాలకు నీరు అందక ఫలసాయాన్ని పశుగ్రాసంగా ఉపయోగించుకోవల్సిన దుస్థితిలో రైతులున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాలు కాలువల ద్వారా, మరో ఐదు లక్షల ఎకరాలు బోర్ల ద్వారా సాగు చేస్తుంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కాలువల ద్వారా నీరు అందకపోగా భూగర్బజలాలు ఇంకిపోయి బోర్ల ద్వారా సాగుచేయడం కష్టమవుతుందని సుబ్బారాయుడు వివరించారు. జూలై, ఆగస్టులో గోదావరి జిల్లాల్లో సార్వా నాట్లు వేస్తుండగా పట్టిసీమ వల్ల ఈ ప్రాంతంలో రెండవ పంటకు కూడా సక్రమంగా నీరందని దుస్ధితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సాగు, తాగు నీరివ్వాలని ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా భావిస్తే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించినా పోలవరం కుడికాలువ ద్వారానే నీరు పంపిణీ చేయాలని అయితే అక్కడ భూసేకరణపై రైతులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇవన్నీ పూర్తికావాలంటే మరొక నాలుగేళ్ల సమయం పడుతుందని, ఇటువంటి తరుణంలో రూ.1400 కోట్లు ఖర్చుచేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. అఖిలపక్షం, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పట్టిసీమ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో పోరాటం చేయడానికి పారీ ్టసిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేషుబాబు, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, పాలకొల్లు మండల పార్టీ కన్వీనర్ ఎం.మైఖేల్‌రాజు, మద్దా చంద్రకళ, నడపన గోవిందరాజులునాయుడు, సప్పరపు కోటేశ్వరరావు, కవురు సత్యనారాయణ, వన్నెంరెడ్డి శ్రీనివాస్, యర్రంశెట్టి బాబులు, పీఆర్‌కే మూర్తి, కర్ణి జోగయ్య, జి.లక్ష్మీనారాయణ, అనిశెట్టి గోపి పాల్గొన్నారు.