కష్టాల రబీ | farmers are concerned on rabi season | Sakshi
Sakshi News home page

కష్టాల రబీ

Dec 2 2014 2:05 AM | Updated on Sep 2 2017 5:28 PM

రబీ సీజన్ ముందుకు సాగడం లేదు. రబీ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా అంతంతమాత్రంగానే పంటలు సాగు అయ్యాయి.

కర్నూలు (అగ్రికల్చర్) : రబీ సీజన్ ముందుకు సాగడం లేదు. రబీ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా అంతంతమాత్రంగానే పంటలు సాగు అయ్యాయి. రైతుల్లో అసంతృప్తి, నిరుత్సాహం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రబీలో సాధారణ సాగు 4,12,490 హెక్టార్లు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 2,98,797 హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి.

ఈసారి మాత్రం కేవలం 1,84,451 హెక్టార్లకే సాగు పరిమితం అయింది. సాధారణ సాగులో 44.72 శాతం మాత్రమే పంటలు సాగు అయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ అందని పండు చందం అయింది. జిల్లా యంత్రాంగం జిల్లాలో 34 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఖరీఫ్ కష్టాలు వెంటాడుతుండటం వల్లనే రబీ పంటల సాగు పట్ల రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్ ఆరంభం అయి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్యాంకులు ఒక్క రైతుకు కూడా పంటరుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 2013 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా పథకం కింద మంజూరు అయిన పరిహారాన్ని కూడా ప్రభుత్వమే జమ చేసుకోవడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఇంతవరకు రుణాలు మాఫీ చేయకపోగా రైతులపై వడ్డీ భారాన్ని మోపడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పంట రుణాలు ఇవ్వకపోగా గత ఏడాది తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించాలని రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

భారీగా తగ్గిన శనగ సాగు...
రాయలసీమ జిల్లాలోనే శనగ సాగులో జిల్లా మొదటి స్థానంలో ఉంది. సాధారణ సాగు 2,15,493 హెక్టార్లు ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 2,06,258 హెక్టార్లు సాగు అయింది. ఈసారి మాత్రం 1,12,119 హెక్టార్లకే పరిమితం అయింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో పత్తి సాగు అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 3 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారు. ఈ పంట జనవరి నెల వరకు ఉంటుంది. ప్రధానంగా పత్తి నల్లరేగడి భూముల్లో సాగు అవుతుంది. రబీ పంటలు కూడా నల్లరేగడి నేలల్లోనే సాగు అవుతాయి. ఖరీఫ్‌లో పత్తి సాగు భారీగా పెరగడం వల్లనే రబీ పంటల సాగు అంతంతమాత్రంగా ఉందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రబీ సీజన్‌కు సంబంధించి కాల్వల కింద పంటల సాగుకు ఇంతవరకు నీళ్లు వదలలేదు. రబీ సాగు పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెరిగిన ధనియాల సాగు...
ఈ రబీలో ధనియాలు సాగు పెరిగింది. సాధారణ సాగు 3,924 హెక్టార్లు ఉండగా, 7,472 హెక్టార్లలో పంటలు వేయడం గమనార్హం. రబీలో శనగ తర్వాత అత్యధికంగా జొన్న సాగు చేస్తారు. ఈసారి జొన్న సాగు కూడా తగ్గిపోయింది. సాధారణ సాగు 60,119 హెక్టార్లు ఉండగా, ఈసారి కేవలం 35,868 హెక్టార్లలో(59.66 శాతం) మాత్రమే జొన్న సాగు అయింది. గత ఏడాది ఇదే సమయానికి 45,350 హెక్టార్లలో జొన్న వేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement