అధికార పార్టీలో దొంగ ఓట్ల జాతర

Fake Votes For TDP In Prakasam District - Sakshi

జిల్లాలోని వ్యక్తులకు పక్క నియోజకవర్గాలు,    పక్క జిల్లాల్లో ఓట్లు 

అంతే స్థాయిలో డబుల్‌ ఎంట్రీలు 

తప్పుల తడకగా ఓటర్ల జాబితా

అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఓట్ల నమోదు

అక్రమాలను ప్రతిపక్ష నాయకులు బయటపెట్టినా స్పందించని ఉన్నతాధికారులు 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  రానున్న ఎన్నికల్లో అధికారమే పరమావధిగా టీడీపీ నాయకులు బరితెగించారు. ఓటర్ల జాబితా తమకు అనుకూలంగా ఉండేందుకు దొంగ ఓట్ల నమోదుకు పూనుకున్నారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవాల్సిన అధికారులు కూడా టీడీపీ నేతలకు వంతపాడుతున్నారు. దీంతో జిల్లాలో అక్రమ ఓట్ల నమోదు వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్ల నమోదును జాతరలా చేపట్టారు. అక్రమ ఓట్ల నమోదును ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా అధికారుల సహకారంతో వ్యవహారాన్ని చాపకిందనీరులా చక్కబెడుతున్నారు.

 ప్రతి నియోజకవర్గంలో జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన ఓట్లే కాకుండా పక్క జిల్లాలకు చెందిన ఓట్లను నమోదు చేస్తున్నారు. పాత, కొత్త డోర్‌ నంబర్లు చూపి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉండేలా చూస్తున్నారు. కొందరు ఆధార్‌ కార్డును చూపితే, మరికొందరు కరెంట్‌ బిల్లు, ఇంటి పన్నును చూపి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా నమోదు గడువు సమీపిస్తుండడంతో అధికార పార్టీ నేతలు అక్రమ ఓట్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో అక్రమ ఓట్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో డబుల్‌ ఎంట్రీలతోపాటు పక్కల నియోజకవర్గాలు, పక్క జిల్లాల ఓట్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. 

ఇవి దొంగ ఓట్లు కాదా? 
ఒంగోలుకు చెందిన మాల్యాద్రికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 131, 60వ పోలింగ్‌ బూత్‌ల్లో ఓటు నమోదైంది. ఐడీ నంబర్లు వేర్వేరుగా ఇచ్చారు. జ్యతి అనే యువతికి సైతం 131, 109 పోలింగ్‌ బూత్‌ల్లో రెండు ఓట్లు కల్పించారు. రాజేశ్వరి అనే యువతికి 131, 132 పోలింగ్‌ బూత్‌ల్లో రెండు ఓట్లు ఇచ్చారు. నూర్జహాన్‌కు 131, 183 పోలింగ్‌ బూత్‌ల్లో, స్వర్ణ అనే మహిళకు 131, 132 పోలింగ్‌ స్టేషన్లలో, మీరాబీకి 131, 78 పోలింగ్‌ బూత్‌ల్లో ఓట్లు  నమోదయ్యాయి. మస్తాన్‌వళి అనే వ్యక్తికి 133, 102, 69, 120 పోలింగ్‌ బూత్‌ల్లో ఏకంగా నాలుగు ఓట్లు నమోదు చేశారు. అస్మా అనే మహిళకు 133, 51, 53 బూత్‌ల్లో మూడు ఓట్లు, ఒంగోలుకు చెందిన దుర్గాభవానికి 133, 5వ నంబర్‌ బూత్‌ల్లో ఓట్లున్నాయి. 

సాయి అనూష(24) అనే యువతికి ఒంగోలులోని బూత్‌ నంబర్‌ 140లో, అద్దంకి నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నం.156లోనూ ఓటు నమోదైంది. సాయితేజ అనే యుతికి ఒంగోలులో 140 పోలింగ్‌ బూత్‌లో, నార్త్‌ అద్దంకిలోని 156 పోలింగ్‌ బూత్‌లో రెండు చోట్ల ఓటు నమోదైంది.  ఒంగోలు 140 బూత్‌లో నమోదై ఉన్న జాకీర్‌ హుస్సేన్‌కు గుంటూరు జిల్లా మాచర్ల పోలింగ్‌ బూత్‌ నం.4లోనూ ఓటుంది. ఒంగోలుకు చెందిన అప్పారావుకు ఇక్కడి 140వ పోలింగ్‌ బూత్‌తోపాటు కృష్ణా జిల్లా గుడివాడ 42వ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటు నమోదు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీకి చెందిన ఆదిలక్ష్మికి ఒంగోలుతోపాటు కొండపి నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నం.260లోనూ ఓటు నమోదైంది.

 ఒంగోలు మున్సిపాలిటీ 138 పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ఖాజాషేక్‌కు కర్నూలు జిల్లా కొడుమూరులో 94వ పోలింగ్‌ బూత్‌ పరిధిలోనూ ఓటు హక్కు కల్పించారు. వీరాంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలుతోపాటు వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మల మడుగు పోలింగ్‌ బూత్‌ 299లో ఓటు నమోదైంది. షేక్‌ ఖాసింబీ అనేమ మహిళకు ఒంగోలుతోపాటు గుంటూరు వెస్ట్‌ 3వ పోలింగ్‌ బూత్‌లో ఓటు కల్పించారు. ఒంగోలుకు చెందిన సోమేశ్వరరావుకు ఒంగోలుతో పాటు గుంటూరు జిల్లా రేపల్లె 95వ పోలింగ్‌ బూత్‌లో ఓట్లు నమోదై ఉన్నాయి. ఒంగోలుకు చెందిన లక్ష్మీనరసింహకు ఒంగోలు 132వ పోలింగ్‌ బూత్‌తోపాటు కర్నూలు జిల్లా శ్రీశైలం 89వ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓట్లు నమోదై ఉన్నాయి. 

ఇదే విధంగా భాస్కర్‌రావు అనే వ్యక్తికి సైతం పైన తెలిపిన రెండు చోట్ల ఓట్లు నమోదై ఉన్నాయి. ఒంగోలు 132వ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని మల్లేశ్వరరావుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి 123వ పోలింగ్‌ బూత్‌లో ఓట్లు నమోదై ఉన్నాయి. ఒంగోలు మున్సిపాలిటీలో 131వ పోలింగ్‌ బూత్‌లో ఓటున్న ముసలయ్యకు మార్కాపురం నియోజకవర్గం 252వ పోలింగ్‌ బూత్‌లోనూ ఓటు నమోదై ఉంది. ఒంగోలు మున్సిపాలిటీలో ఓటు ఉన్న నాగార్జునకు కనిగిరిలోని 213 పోలింగ్‌ బూత్‌ పరిధిలోనూ ఓటుంది. 

అధికారుల ‘డబుల్‌’ గేమ్‌!
జిల్లాకు చెందిన వ్యక్తులకు పక్క జిల్లాల్లో ఓటు హక్కు ఎలా కల్పించారో అధికారులే సెలవివ్వాలి. జిల్లాలోనే ఒక నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి మరో నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించడం వెనుక మతలబు ఏమిటి? అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం కరువైంది. ఒక వ్యక్తికి రెండు, మూడు, నాలుగేసి ఓట్ల చొప్పున నమోదు చేయడంపై ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తుంటే అధికారులు నీళ్లు నములుతున్నారే కానీ ఓట్లు తొలగించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేశారు. 

జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు నమోదై ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దొంగ ఓట్ల సంఖ్య లక్షకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో బయటపడుతున్న అక్రమాలు, తప్పుడు ఓట్లను చూస్తుంటే అధికారులు ఈ–వెరిఫికేషన్‌ను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేవలం అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు టీడీపీ నేతలకు అనుకూలంగా ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమ ఓట్లు, డబుల్‌ ఓట్ల వివరాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆర్డీఓ మొదలుకుని, జేసీ, కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి అందించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు కోరారు. అధికారులు మాత్రం అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా చోద్యం చూస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని వైఎస్సార్‌ సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. 

ఆగని అక్రమాల దందా
► ఒంగోలు తహశీల్దారు కార్యాలయంలో దొంగ ఓట్లు నమోదు
► టీడీపీ నేతలు ఇచ్చిన దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌
► అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నేత శింగరాజు వెంకట్రావు
► సక్రమ దరఖాస్తులంటూ బొంకిన తహసీల్దార్‌ బ్రహ్మయ్య
► దరఖాస్తుదారులకు రశీదులివ్వకపోవడంపై నిలదీత

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నియోజకవర్గంలో అక్రమ ఓట్ల నమోదు యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నేతలు బల్క్‌గా ఇచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. శనివారం సెకండ్‌ సాటర్డే అయినా తహశీల్దార్‌ బ్రహ్మయ్య మాత్రం తన కార్యాయానికి వచ్చి మరీ ఓటర్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తన అనుచరులతో వెళ్లి తహశీల్దారు బ్రహ్మయ్యతో పాటు సిబ్బందిని నిలదీశారు. 

బల్క్‌గా వచ్చిన దరఖాస్తులు అధికార పార్టీ నేతలు ఇచ్చినవే కదా అని ప్రశ్నించారు. ఓటర్లు ఇచ్చిన దరఖాస్తులైతే పూర్తి స్థాయిలో ఫిలప్‌ చేసి ఉంటాయని, పైపెచ్చు దరఖాస్తుదారుడికి రశీదు ఇస్తారని, ఈ దరఖాస్తులు అలా లేవేంటని తహశీల్దార్‌ను అడిగారు. తాము సక్రమమైన దరఖాస్తులను ఆనలైన్‌ చేస్తున్నామని, దరఖాస్తుదారులు రశీదు తీసుకోలేదంటూ తహశీల్దార్‌ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో శింగరాజుకు తహశీల్దార్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.

 అక్రమ ఓట్లు నమోదు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని వెంకట్రావు తహశీల్దారును హెచ్చరించారు. ‘నాతో గొడవపడాల్సిన పని లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి’ అంటూ తహశీల్దారు దొంగ ఓట్ల నమోదును కొనసాగించారు. అక్రమ ఓట్ల నమోదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సైతం శింగరాజు ఫిర్యాదు చేశారు. అధికారులు అధికార పార్టీకి తొతుల్తుగా వ్యవహరిస్తూ  అక్రమ ఓట్లు నమోదు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్‌ వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top