డబుల్‌ చీటింగ్‌

Fake And Double Voter Id Cards In PSR nellore - Sakshi

ఫొటో ఒకటే.. ఓట్లు రెండు

ఇతర జిల్లాల ఓటర్లు జిల్లాలో నమోదు

భారీగా బోగస్‌ ఓట్లకు తెగబడుతున్న టీడీపీ నేతలు

ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో డబుల్‌ ఎంట్రీల నమోదు

స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో భారీగా జిల్లాలో ఓట్ల చేరిక

35 వేలకు పైగా డబుల్‌ ఎంట్రీలు నమోదైనట్లు అంచనా

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అధికార పార్టీ పూర్తిగా అభాసుపాలు చేసింది. ప్రధానంగా అధికార పార్టీకి పట్టు ఉండే గ్రామాల్లో భారీగా డబుల్‌ ఎంట్రీలు నమోదు చేయించి ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బాగా బలం ఉన్న ప్రాంతాల్లో రకరకాల కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారు. 2015 నాటి జాబితాతో పోలిస్తే కొద్దినెలల కిత్రం అధికారులు ప్రకటించిన జాబితాలో జిల్లాలో 2.05 లక్షల ఓట్లు తొలగించారు. వీటిలో అత్యధిక ఓట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన శాసనసభ్యులు ఉన్న ప్రాంతాలే కావటం గమనార్హం. డబుల్‌ ఎంట్రీల పేరుతో గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన అధికార గణం ఇప్పుడు అధికార పార్టీ నేతలు డబుల్‌ ఎంట్రీ ఓట్లకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది.

ముఖ్యంగా జిల్లాలో తాజా ఎన్నికల జాబితా ప్రకారం సుమారు ఇప్పటికే 35 వేలకు పైగా బోగస్‌ ఓట్లు నమోదుఅయినట్లు తెలుస్తోంది. గూడూరులోని వ్యక్తికి గూడూరు, నెల్లూరులో ఓట్లు నమోదు చేశారు. అలా ఒంగోలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని కొందరి ఓట్లు కూడా నెల్లూరు జిల్లాలో నమోదు చేసి ఉండటం విశేషం. ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో 2014 ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో బోగస్‌ పేరుతో పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి, వాటి స్థానంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను డబుల్‌ ఎంట్రీలు నమోదు చేయించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో వీటి ద్వారా లబ్ధి పొందాలని బలంగా యత్నాలు సాగిస్తున్నారు.

ఉదాహరణకు షేక్‌ సర్దార్‌ అనే వ్యక్తికి నెల్లూరు నగరంలో నాలుగో పోలింగ్‌ బూత్‌లో ఓటు హుక్కు ఉంది. ఇదే సర్దార్‌కు మళ్లీ కోవూరులోని 126 నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు ఉంది. అలాగే పి.వెంకటేశ్వర్లకు నెల్లూరు నగరంలోని 16వ పోలింగ్‌ బూత్‌లోనూ సర్వేపల్లిలోని 202 పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు ఉంది.

పై విధంగా ఒకటి రెండు కాదు.. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఒక్కో వ్యక్తికి సంబంధించి రెండేసి ఓట్లు చేర్చారు. గతంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్‌ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓటు భారీగా తొలగించారు. గతంలో బీఎల్‌ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికీ పరిశీలన సరిగా నిర్వహించేలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా నియోజకవర్గానికి చెందని వారిని కూడా తీసుకువచ్చి రెండేసి ఓట్లు నమోదు చేయిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top