భారత్‌లో తీర్పులు నిష్పక్షపాతం | Fairness judgments in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో తీర్పులు నిష్పక్షపాతం

Oct 11 2014 1:26 AM | Updated on Sep 2 2017 2:38 PM

భారత్‌లో తీర్పులు నిష్పక్షపాతం

భారత్‌లో తీర్పులు నిష్పక్షపాతం

దేశంలోని కోర్టులు కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందినవి కావని..

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా

మెదక్: దేశంలోని కోర్టులు కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందినవి కావని.. ప్రపంచంలోని ఏదేశ ప్రజలకైనా నిష్పక్షపాత న్యాయాన్ని అందిస్తాయని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మెదక్ పట్టణంలో నిర్మించిన కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. దేశంలో ఉన్న స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఒక మతాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా... బాధితులెవరైనా సరే వారికి విస్పష్టమైన న్యాయాన్ని అందిస్తుందని హైకోర్టు సీజే పేర్కొన్నారు.

ఒక విదేశీయుడికి కూడా భారతదేశంలో న్యాయం పొందే హక్కు ఉందన్నారు. ఒక విదేశీ మహిళకు దేశంలో జరిగిన అన్యాయంపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు మన దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థ పనితీరుకు అద్దం పట్టిందన్నారు. తాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టానని తెలిపారు. తద్వారా త్వరితగతిన ప్రజలకు న్యాయం చేసే వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ శివశంకర్‌రావు, మెదక్ జిల్లా మొదటి అదనపు సెషన్స్‌జడ్జి జి.రాధారాణి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement