డుమ్మా కుదరదిక | Eye on the performance of staff | Sakshi
Sakshi News home page

డుమ్మా కుదరదిక

May 23 2016 1:38 AM | Updated on Sep 4 2017 12:41 AM

డుమ్మా కుదరదిక

డుమ్మా కుదరదిక

ఆ శాఖ లక్ష్యం ఉన్నతం.. తల్లీబిడ్డల క్షేమం కోరి పలు పథకాలు అమలు చేసింది.

సిబ్బంది పని తీరుపై డేగకన్ను
అమలైతే డుమ్మా కొట్టే వారి ఆటకట్టు
కసరత్తు చేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

 

ఆ శాఖ లక్ష్యం ఉన్నతం.. తల్లీబిడ్డల క్షేమం కోరి పలు పథకాలు అమలు చేసింది. క్షేత్రస్థాయిలో మాతా శిశువులకు అందలేదు. కారణం అంగన్‌వాడీ కార్యకర్తలు విధులకు డుమ్మా కొట్టడమేనని ప్రభుత్వ సర్వేలో తేలింది. కేంద్రాలు నడపకుండా డుమ్మా కొట్టే అంగన్‌వాడీ కార్యకర్తలకు చెక్ పెట్టేందుకు స్త్రీ శిశుసంక్షేమ శాఖ బయోమెట్రిక్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానం అమలైతే విధులకు గైర్హాజరయ్యే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఆటలకు చెక్ పెట్టినట్టే.

 

చిత్తూరు(గిరింపేట): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తల సమయపాలన కోసం బయోమెట్రిక్ ఏర్పాటు చేయనున్నారు. తల్లీ బిడ్డ సంక్షేమం కోసం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో  గర్భిణుల్లో రక్తహీనత, మాతాశిశు మరణాలను నివారణ, కిశోర బాలికలకు పౌష్టికాహారం, నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది.ఈ  పథకాల అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.వేలాది కోట్లు విడుదల చేస్తోంది. అయినప్పటికీ  క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. ఇందుకు గల కారణాలను గుర్తించగా  క్షేత్ర స్థాయిలోని సిబ్బంది సక్రమంగా పని చేయడం లేదని తేలింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందితో పనిచేయించడం, సమయపాలనకు అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఆ దిశ గా చర్యలు చేపడుతోంది. త్వరలో ఈ విధానం జిల్లాలో అమలుకానుంది. ఈ విధానం అమలైతే ఇప్పటివరకు యూనియన్ సమావేశాలు, ఆ పనులూ, ఈ పనులూ అంటూ తమ విధులకు డుమ్మా కొట్టేవారిని గుర్తించి కొరడా ఝళిపించనుంది.

 
వేలలో సిబ్బంది

జిల్లాలో 3640 అంగనవాడీ కేంద్రాలున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు - 3640, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 1128 ఉన్నాయి. వీటిలో ఓ కార్యకర్త, ఓ ఆయా వంతున 9,536 మంది పనిచేస్తున్నారు. వీటిని పాలనా సౌలభ్యం కోసం మొత్తం 21 ప్రాజెక్టులుగా విభజించారు. ఆయా ప్రాజెక్టులో కేంద్రాల పర్యవేక్షణకు 21 మంది చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు( సీపీడీఓ), 10 మంది అడిషనల్ చైల్డు డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(ఏసీడీపీవో), రోజు వారీ తనిఖీల నిమిత్తం సూపర్‌వైజర్‌లు గ్రేడ్-1లో 51 మంది. గ్రేడ్-2లో 65 మంది పనిచేస్తున్నారు.

 
లక్షలాది మందికి లబ్ధి

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న బాలింతలకు, గర్భిణులు, మురికివాడలలో నివసిస్తున్న 6 నుంచి 72 నెలలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పథకం అమలు చేస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆకు కూరతో భోజనం, బాలింతలు, గర్భిణులకు టేక్ హోమ్ రేషన్(టీహెచ్‌ఆర్) ఇస్తున్నారు. ఈ పథకాల ద్వారా సుమారు 85 వేల మంది గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్లలోపు ఉన్న 1,00,850 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో కేంద్రం లో 30 నుంచి 40 మంది దాకా పిల్లలు ఆ కేంద్రాల్లోనే భోజనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలు సక్రమం గా పనిచేయకపోవడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం, టేక్‌హోమ్ రేషన్ అందడం లేదు. దీంతో నిధులు దుర్వినియోగమై పక్కదారి పడుతున్నాయి. ఈ క్రమంలో పథకాన్ని పక్కా అమలు చేసి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లక్ష్యం సాధించాలన్న ఆలోచనతో బయోమెట్రిక్‌ను ప్రవేశపెడుతున్నారు. బయోమెట్రిక్‌తో సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టి, కేంద్రాలకు సక్రమంగా రాని సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement