అర్థరహితం..అసంబద్ధం

Experts comments About Chandrababu Allegations on EC - Sakshi

ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలను తప్పుబట్టిన నిపుణులు

సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేయడం దారుణమని వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పనితీరుపై ఆయన లేవనెత్తిన సందేహాలు అసంబద్ధమైనవని కొట్టిపారేశారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ప్రస్తుతం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. 

బాబు ఆరోపణలు ప్రజాస్వామ్య విరుద్ధం
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని భావించిన కొందరు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. నిరాధార ఆరోపణలు చేసిన నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
– ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్‌ కార్యదర్శి 

ఎన్నికలపై అనవసర రాద్ధాంతం తగదు 
ఎన్నికల సంఘానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం దారుణం. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది. దేశంలో కంప్యూటర్లను, టెక్నాలజీని తానే తెచ్చానని చంద్రబాబు అంటారు. కానీ, ఈవీఎంలను వ్యతిరేకిస్తారు. టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగించారు. అప్పుడెందుకు ఈవీఎంల పనితీరును తప్పుబట్టలేదు? ఈవీఎంతో పాటు ప్రస్తుతం వీవీ ప్యాట్‌లను కూడా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరిగాయి. ఎన్నికలపై అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదు. 
– ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి, మాజీ వీసీ, ఏయూ, ఏఎన్‌యూ 

ఓటమి భయంతోనే చంద్రబాబు సాకులు 
ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో, 2016 నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించారు. ప్రస్తుతం ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈవీంఎంలు చెడ్డవా? ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారు.
– ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు  

అప్పుడెందుకు ఫిర్యాదు చేయలేదు  
తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని చంద్రబాబు అనడం సరైంది కాదు. అలాగైతే అప్పుడే పోలింగ్‌ అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఒక్క చంద్రబాబే కాదు... లక్షలాది మంది ఓటర్లు ఓట్లేశారు. వారిలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వారెవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఓటు ఎవరికి వేశారో తెలియకపోతే పోలింగ్‌ బూత్‌ల వద్ద అలజడులు జరిగేవి. అలా జరగలేదంటే పోలింగ్‌ సక్రమంగా జరిగినట్లే కదా. ఈవీఎంలపై సందేహాలుంటే 2014 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా ఒక్కసారైనా ఆ విషయాన్ని టీడీపీ ప్రస్తావించిందా? పార్లమెంటులో లేవనెత్తిందా? చంద్రబాబు ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయి. 
– ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్, సీనియర్‌ పాత్రికేయుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top