పట్టణంలోని పలనాడు జూనియర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని వేధిస్తున్న ఈవ్‌టీజర్‌ను కళాశాల యాజమాన్యం వారు ...
పోలీసులకు అప్పగింత
మాచర్లటౌన్: పట్టణంలోని పలనాడు జూనియర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని వేధిస్తున్న ఈవ్‌టీజర్‌ను కళాశాల యాజమాన్యం వారు అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సోమవారం సాయంత్ర ఆరు గంటల సమయంలో కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిని పట్టణంలో నడిచి వెళుతుండగా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన తాడి రమణయ్య ఆమెపట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వాహనం ఎక్కాలంటూ వేధించాడు. అంతకు ముందు కూడా తనను వేధిస్తున్న ఆ యువకుడి తీరు పట్ల ఆవేదన చెందిన విద్యార్థిని కళాశాలకు వెళ్లి డెరైక్టర్ కావూరి శ్రీరాములుకు విషయం చెప్పింది.
స్పందించిన ఆయన విద్యార్థులను తీసుకుని పట్టణంలో ఆ యువకుడి కోసం గాలించారు. పార్కు సెంటర్‌లో ఉన్న రమణయ్యను విద్యార్థిని చూపించగానే వారు పట్టుకుని కళాశాలకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సైకో తీరులో మాట్లాడుతున్న ఆ యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ జయకుమార్ తెలిపారు. విద్యార్థుల వేధింపులు తాళలేక తిరుపతమ్మ ఆత్మహత్య చేసుకున్న విషయం మరువకముందే ఇలాంటివి జరగడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.