
తెల్లవారేసరికి రూ.50 లక్షల ప్రవేశపన్ను వసూలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయడం మొదలు పెట్టింది.
నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయడం మొదలు పెట్టింది. కోదాడ, వాడపల్లి, నాగార్జున సాగర్ చెక్పోస్టులలో ఏపీ నుంచి వచ్చే వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు 150 వాహనాల నుంచి 50 లక్షల రూపాయల పన్ను వసూలు చేశారు. అర్ధరాత్రి పన్నులు వసూలు చేస్తున్నారన్న విమర్శ సరైనది కాదని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. మూడు నెలల క్రితమే సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.
మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీలోని13 జిల్లాల్లో సుమారు 32 లక్షల లారీలు, 800కిపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలావరకూ నిత్యం తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి రోజుకు 300 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రతి లారీ తాత్కాలిక పర్మిట్ (నెలకు) కింద సుమారు 6 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.