రాఖీ పండగ రోజు అన్నకు తీవ్ర విషాదం..!

Engineering Student Suicide YSR Kadapa - Sakshi

తల్లి చిన్నతనంలోనే మరణించింది. తండ్రి ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తూ కూతురిని చదివిస్తూ వచ్చాడు. విధిరాతలో తండ్రికూడా ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లీతండ్రిని కోల్పోయిన ఆ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజున ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉన్న ఒక్కగానొక్క సోదరుడికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పులివెందుల వైఎస్సార్‌ కడప: అనంతపురం పట్టణంలోని రాణినగర్‌కు చెందిన నాగన్న, నారాయణమ్మలకు కుమార్తె రాజేశ్వరి(20), కుమారుడు రవి ఉన్నారు. వీరిలో రాజేశ్వరి పులివెందులలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ 3వ సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివించేవాడు. అయితే ఈఏడాది మే నెలలో అనారోగ్యంతో ఆయన కూడా మృతిచెందడంతో రాజేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం తన స్నేహితురాలితో కలిసి పట్టణంలోని శివాలయం వెళ్లి అక్కడ దేవుని దర్శనం చేసుకొంది. అనంతరం షాపింగ్‌కు వెళ్లి స్థానికంగా ఒక హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో జేఎన్‌టీయూ లోని బాలికల హాస్టల్‌ గల తన గదికి చేరుకుంది. ఆ తర్వాత 4గంటల ప్రాంతంలో టీ బ్రేక్‌ కావడంతో తోటి స్నేహితురాలు వెళ్లి పిలవగా ఎంతకు తలుపు తెరవకపోవడంతో సిబ్బందికి తెలియజేసింది. వారు వెళ్లి తలుపులు బద్దలుకొట్టి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది.

కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయగా అర్బన్‌ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ శివప్రసాద్‌లు ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అటు తల్లిదండ్రులను కోల్పోయిన బాధకు తోడు.. ఉన్న ఏకైక సోదరి కూడా కన్ను మూయడంతో సోదరుడు అనాథగా మారిన సంఘటన అందరినీ కలచి వేస్తోంది. సీఐ పుల్లయ్య మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top