పది చదువు..ఆపై కొలువు

Employment Course After Tenth And Polytechnic - Sakshi

పేద విద్యార్థులకు వరంగాపాలిటెక్నిక్‌ కోర్సులు

వినియోగించుకుంటే చక్కటి అవకాశం

పదోతరగతి విద్యార్హతతో ఉద్యోగావకాశాలను  అందిపుచ్చుకొనే కోర్సుల్లో పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ కోర్సు ప్రధానంగా ఉంది. ఈ డిప్లొమా కోర్సును తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో 7 కళాశాలలు ఏర్పాటు చేయగా ఇందులో రాపూరు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ఒకటి. పది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందులో చేరి డిçప్లొమా కోర్సును పూర్తి చేస్తే  పశుసంవర్థక శాఖలో వెటర్నరీ  సహయకుల  ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రైవేటు డైయిరీల్లోనూ ఉపాధి అవకాశాలను అందిపుక్చుకోవచ్చు.

రాపూరు: గ్రామీణ ప్రాంతంలో పదోతరగతి వరకే పరిమితమవుతున్న పేద విద్యార్థులకు పశువైద్యంలో ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో  ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం  పశుసంవర్థక శాఖ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులను  అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కోర్సులను బోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కళాశాలలను నిర్వహిస్తుంది, రాపూరు (నెల్లూరు జిల్లా), రామచంద్రాపురం (పశ్చిమగోదావరి), పలమనేరు (చిత్తూరు), మడకశిర (అనంతపురం), బద్వేల్‌ (కర్నూల్‌), గడివిడి (విజయనగరం) ప్రాంతాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబం«ధించి  రాపూరుకు  5 కిలో మీటర్ల దూరంలో ఉన్న బొజ్జనపల్లి సమీపంలో సుమారు 30 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలతో  పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటుచేయడం జరిగింది.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  2006 సంవత్సరం జూన్‌ 3వ తేదీన రాపూరులో పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2007–2008 విద్యాసంవత్సరం నుంచి రాపూరు బాలికల ఉన్నత పాఠశాలలోని మూడుగదుల్లో తరగతులను ప్రారంభించారు.అనంతరం బొజ్జనపల్లి వద్ద  కళాశాలను సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించారు. బాలుర, బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు, ప్రిన్సిపాల్‌ వసతి, వాచ్‌మేన్‌ గది, సీసీరోడ్లు, విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు రక్షణగా 9 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. 2006 నుంచి 2014 వరకు ఏటా 20 సీట్లు కల్పిస్తు వచ్చారు.ఇందులో చేరేందుకు గ్రామీణ విద్యార్థులనుంచి ఆసక్తి పెరగడంతో 2015 నుంచి అదనంగా 10 సీట్లు పెంచి మొత్తం 30 సీట్లలో విద్యార్థులను చేర్చుకుంటున్నారు.  వసతి సౌకర్యంరెండేళ్ల కోర్సుకాలంలో విద్యార్థులు వసతిగృహాల్లోనే ఉండేలా అన్ని వసతులు కల్పించారు.రాపూరులో కళాశాల ప్రక్కనే విద్యార్థిని, విద్యార్థులకు  వేరువేరుగా చక్కటి  వసతి గృహ భవనాలను ఏర్పాటుచేశారు.

దరఖాస్తు చేసుకునేదిలా..
రాపూరు ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల్లో 30 సీట్లు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కోర్సులో చేరాలంటే  ఎస్‌సీ, ఎస్‌టీలకు 10వ తరగతిలో55శాతం, ఓసీ, బీసీలకు 60 శాతం మార్కులు ఉండాలి. కోర్సులో చేరేవారికి 22సంవత్సరాల లోపు ఉండాలి. డబ్ల్యూడబ్ల్యూ .ఎస్‌వివియు.ఈడీయు.ఇన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని శ్రీవెంకటేశ్వర పశుసంవర్థక కళాశాల, తిరుపతికి దరఖాస్తు చేసుకుంటే వారు కౌన్సిలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. జూన్‌ మాసంలో పత్రికా ప్రకటనద్వారా లేదా ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

ఉపాధి అవకాశాలిలా..  
కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల ఉద్యోగాలకు అర్హులవుతారు.ప్రైవేటు రంగంలో డైరీ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ ఉద్యోగ అవకాశాలుంటాయి.  ప్రస్తుతం  వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడిపరిశ్రమ వృద్ధి చెందుతోంది. పాల ఉత్పత్తుల్లో రెండంకెల వృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు  పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యుల కొరత తీవ్రంగా ఉన్నా నేపథ్యంలో పశువైద్యసేవలతో స్వయం ఉపాధి పెంపొందించుకోవచ్చు . ఇంటర్‌ ఆపై తరగతులు చదివే స్తోమత లేని విద్యార్థులు పదోతరగతి ఉతీర్ణతతో ఈ కోర్సులో చేరితే త్వరగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. 

ఉపాధి అవకాశాలు మెండు
వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా పాడిపరిశ్రమ పురోభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ పశుసంర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ  చేసినప్పుడు సులభంగా ఉద్యోగవాకాశాలు పొందవచ్చు. రాపూరు కళాశాల్లో సీట్ల భర్తీకి శ్రీవెకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి త్వరలో ప్రకటన వెలువడనుంది. – పి. వెంకటేశ్వరావు, ప్రిన్సిపాల్, వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల, రాపూరు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top