ఉండేదెవరు...? వెళ్లేదెవరు...?

Employees Transfer Rumours in Vizianagaram - Sakshi

ప్రభుత్వ మార్పుతో అధికారుల బదిలీపై చర్చ

ప్రయత్నాలు ప్రారంభించిన కొందరు అధికారులు

టీడీపీ అనుకూల ముద్రపడిన అధికారుల్లో గుబులు

జిల్లాకు రావాలని ఆశపడుతున్నఇతర ప్రాంతాల్లో ఉన్నవారు

ప్రభుత్వం మారుతోంది. పాలనలో విధానాలు మారుతాయి. కొత్త పాలకులు పగ్గాలు చేపట్టాక సహజంగానే ప్రక్షాళన మొదలవుతుంది. ఇప్పుడదే జిల్లాలోని అధికారుల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనుకూలురన్న ముద్రపడినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యమైన అధికారుల్లో ఎవరుంటారు.. ఎవరు వెళ్లిపోతారన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇక వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు జిల్లాకు రావాలని ఆశపడుతున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది.

విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న నేపథ్యంలో జిల్లాలో అధికారుల బదిలీలపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న జిల్లా అధికారుల్లో ఎంతమంది జిల్లాలో కొనసాగుతారు... ఎందరు జిల్లా నుంచి బయటకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే కొంతమంది అధికారులు జిల్లా నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతుండగా,.. కొంతమంది మాత్రం ఇక్కడే కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇతర జిల్లాలో పని చేసే అధికారులు సైతం ఇక్కడకు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని వినికిడి. ఈ మేరకు ఎవరికి వారే తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని అధికార వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది.

పాలనపై దృష్టిపెట్టిన కొత్త నేత
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు అఖండ మెజార్టీ కట్టబెట్టిన విషయం విదితమే. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రంలో పరిపాలనపై దృష్టిసారించగా ప్రమాణ స్వీకారం తర్వాత పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో పని చేసే అధికారులతోపాటు జిల్లాలో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది. అంతేగాదు. జిల్లా స్థాయిలో పని చేసే అధికారుల బదిలీలు కూడా కొన్ని వచ్చే నెలలో చేపట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పని చేసే కీలక అధికారులతోపాటు ఇతర జిల్లా అధికారులు బదిలీలపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కలెక్టరేట్‌తోపాటు ఇతర కార్యాలయాలకు వెళితే జిల్లాలో అధికారులు ఎవరు కొనసాగుతారు... ఎవరి వెళ్లిపోతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బదిలీలు ఎందరికి?
ప్రభుత్వం మారిన తర్వాత బదిలీలు సహజమే. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం నియమించిన అధికారులను పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు కీలక పోస్టుల్లో వేసుకుంటుంది. జిల్లా స్థాయిలో నాయకులు కూడా తమకు నచ్చిన వారిని తెచ్చుకుని పని చేయించుకోవాలని చూస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో అధికారుల మార్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇందులో భాగంగా బదిలీలు ఎవరికి ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ బదిలీపై ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చారు. అప్పట్లో ఆయన అధికారపార్టీకి పూర్తిగా విధేయుడిగా పని చేశారు. ఎన్నికల్లో మాత్రం కాస్తా నిష్పక్షపాతంగా పని చేశారు. కానీ ఆయన పోలింగు ముగిసిన తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో తాను రెండువారాల్లో వెళిపోతానని చెప్పడం, తన సన్నిహిత అధికారుల వద్ద కూడా తనకు బదిలీ ఉంటుందని చెప్పడంతో ఆయన బదిలీపై ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ విషయానికొస్తే ఆయన ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చారు.

నాన్‌కేడరు ఎస్పీగా జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వంలో పెద్దలు కోరి ఆయనను వేసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా అప్పట్లో ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయన బదిలీపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి ఉంది. జేసీ వెంకట రమణారెడ్డి జిల్లాకు వచ్చి ఏడాదైంది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీలో పలువురు నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయన బదిలీ ఉండకపోవచ్చు. కానీ ఆయన రాయలసీమలో ఏదైనా జిల్లాకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నించవచ్చునని చర్చ జరుగుతుంది. ఆయన కోరుకుంటే బదిలీ ఖాయమే. పార్వతీపురం ఐటీడీఏ పీవో లక్ష్మిశ, సబ్‌కలెక్టర్‌ చేతన్‌ వచ్చి రెండేళ్లు కాలేదు... ఇద్దరూ రాజకీయాలకు అతీతంగా పని చేస్తారన్న పేరున్నా బదిలీల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న ఆసక్తి ఉంది. ఇక జిల్లా అధికారులంతా గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు వచ్చిన వారే. కానీ వీరిలో కొంతమంది మాత్రం అధికారపార్టీకి పూర్తి విధేయులుగా పని చేశారు. కొందరు మాత్రం ప్రభుత్వం ఏదైతే తమకెందుకు... తమ విధులు తాము చేసుకుపోతామన్న రీతిలో వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరి విషయంలో అధికారపార్టీ నాయకులు ఎలా ఆలోచిస్తారని, వారిలో ఎందరిని ఇక్కడ కొనసాగిస్తారన్న ఆసక్తి నెలకొంది.

కొనసాగేందుకు ప్రయత్నం
ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న అధికారులు చాలామంది జిల్లాలో కొనసాగాలని ఆసక్తితో ఉ న్నారు. ఇందులో చాలామంది గతంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, చీపురుపల్లి ఎమ్మె ల్యే బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండగా జిల్లాలో పని చేశారు. ఇదే చనువుతో మళ్లీ వారి ప్రభుత్వ హయాంలో పని చేయాలని కొందరు ఆసక్తి కనపరుస్తున్నారు. వీరే కాకుండా ప్రస్తు తం పని చేస్తున్న అధికారుల్లో చాలామంది ఇక్క డే ఉండాలని చూస్తున్నారు. మంత్రివర్గ ఏర్పా టు తర్వాత జిల్లాలో మంత్రి పదవి చేపట్టిన వారి వద్దకు వెళ్లి ప్రయత్నించాలని భావిస్తున్నా రు. మరికొందరు ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమ మనుసులో మాట చెబుతున్న ట్లు సమాచారం. ఇదిలాఉండగా ఇంతకుముం దు జిల్లాలో పని చేసి, వేరేప్రాంతంలో ఉన్న పలువురు అధికారులు మళ్లీ జిల్లాకు వచ్చేందు కు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారు కూడా నాయకులను కలిసేందుకు సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top