పని చేయకపోయినా ‘కూలి’

Election Offer For MGNREGA Laborers - Sakshi

ఉపాధి కూలీలకు ఎన్నికల ఆఫర్‌

ఎప్పుడైనా పనికి వెళ్లొచ్చు.. ఎప్పుడైనా వెళ్లి పోవచ్చు

సాక్షి, కందుకూరు రూరల్‌ (ప్రకాశం): మండలంలో టీడీపీకి ఓటు వేసే పనైనా పనులకు రావాల్సిన అవసరం లేదు. పనులకు వచ్చినా కనిపించి వెళ్తే చాలు.. మీరు ఎప్పుడు పనికి వచ్చినా ఫర్వాలేదు. మీకు రావాల్సిన పూర్తి కూలి వస్తుందంటూ బహిరంగంగానే చెబుతున్నారు. కూలీలు పని చేయకుండానే మస్టర్లు వేస్తుంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా అని వారిని అనుకూలంగా మార్చుకుంటున్నారు. పనికి రాకుండా ఉపాధి మస్టర్లు వేసి కూలీలను సైతం ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

అంతా అనుకూలమైన వాళ్లే
టీడీపీ 2014 ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వంలోకి రాగానే పాత ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి టీడీపీకి అనుకూలమైన సీనియర్‌ మేట్లు, టీడీపీ కార్యకర్తలను ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా నియమించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో వారి ప్రభావం చూపిస్తున్నారు. ఎలాగైనా కూలీలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకూ మస్టర్ల ద్వారా ఎర వేస్తున్నారు. దీనిపై అధికారులు కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

అందరికీ వాటా...
ఎన్నికల ప్రలోభాలతో పాటూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు వారి వాటా వారు పంచుకుంటున్నారు. పనికి రాక పోయినా ఫర్వాలేదు. రూ.180ల నుంచి రూ.200లు వరకు రోజుకొక కూలి వేసి మీకు వారానికి రూ.1000ల నుంచి రూ.1100ల వరకు కూలి వచ్చేలా చేస్తామంటున్నారు. ఒక కూలి వారికి రూ.100ల వరకు ఇస్తే చాలంటున్నారు. ఇలా మండలంలో 19 పంచాయతీలు ఉంటే సుమారు 3500 మంది పనులకు హాజరవుతున్నారు. వారికి వంద రూపాయిలు చొప్పున రూ.3.50 లక్షలు వసూళ్ల వరకు  వసూలు చేస్తున్నట్లు సమాచారం.  ఈ సొమ్మును ప్రాజెక్టులోని ప్రతి అధికారికి చేరుతున్నట్లు సమాచారం. ఇలా మండలంలో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  ఒక పక్క ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతున్నా దానిని ఓట్ల ప్రలోభాలకు కూడా మార్చుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top