జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ సావిత్రీదేవి కన్నుమూత | East Godavari district first women mlc Savitri Devi died | Sakshi
Sakshi News home page

జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ సావిత్రీదేవి కన్నుమూత

Oct 19 2014 12:59 AM | Updated on Oct 5 2018 8:54 PM

జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ సావిత్రీదేవి కన్నుమూత - Sakshi

జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ సావిత్రీదేవి కన్నుమూత

జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ ఎనుముల సావిత్రీదేవి (91) కన్నుమూశారు. కాకినాడలో కుమారుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ మెహర్‌ప్రకాష్ ఇంట ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

కాకినాడ :జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్సీ ఎనుముల సావిత్రీదేవి (91) కన్నుమూశారు. కాకినాడలో కుమారుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ మెహర్‌ప్రకాష్ ఇంట ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహిళలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన ఆమె కాకినాడలో అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పాటు పడ్డారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టడానికి ముందు, పదవీ కాలంముగిసన తరువాత కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని ఈ ప్రాంత ప్రజల  గౌరవాదరాల్ని పొందారు. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన ఆమె 1941 ప్రాంతంలో జిల్లాలోని ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన రాజా ఎనుముల వెంకట నరసింహారావును వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి రావు బహద్దూర్ నెట్టిమి రామ్మూర్తినాయుడు గంజాం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. హిందీ, ఆంగ్లభాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన సావిత్రీదేవికి మొదటి నుంచి విద్యపై మక్కువ ఉండేది. వివాహంతో జిల్లాకు వచ్చాక ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఒకప్పుడు పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా పనిచేసిన మల్లిపూడి పళ్లంరాజుకు ఆమె సమీప బంధువు.
 
 ఆమె సమర్థతను, ఆసక్తిని గమనించిన అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు 1972లోఎమ్మెల్సీని చేశారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారురాగా నిలిచారు. కొందరు మహిళా ప్రముఖులతో కలిసి అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. కాకినాడ మహిళా సూపర్‌బజార్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. లేడీస్‌క్లబ్ ఏర్పాటులోనూ ఆమె కృషి ఎనలేనిది. గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ గౌరవ కార్యదర్శిగా, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త కార్యదర్శిగా, కన్స్యూమర్ కౌన్సిల్ సభ్యురాలిగా, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షురాలిగా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 ప్రాంతంలో పంతం పద్మనాభం దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా పనిచేశారు.
 
 ప్రముఖుల శ్రద్ధాంజలి
 సావిత్రీదేవి మృతి పట్ల కాకినాడకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, ఐడియల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ చిరంజీవినీ కుమారి, రోటరీ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ్, ఎన్‌ఎఫ్‌సీఎల్ రిటైర్డ్ జీఎం లక్కరాజు శేషుకుమారి తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement