రుణాల పేరుతో మోసగిస్తారా?

Dwcra Groups Womens Conflicts in Anantapur - Sakshi

సభలకు జనాన్ని రప్పించేందుకు రుణాల వల

టీడీపీని కీర్తిస్తూ నేతల ప్రసంగాలు

అడ్డుకున్న మహిళలు..

రుణాల మాటేమిటంటూ నిలదీత

దూదేకుల ఫెడరేషన్‌ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమైన కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. రుణాల ఆశచూపి సభలకు, సమావేశాలకు మూడేళ్లుగా తిప్పుకున్నారు. ఓపిక నశించిన బాధిత మహిళలు ఆదివారం నగరంలో జరిగిన దూదేకుల జాబ్‌మేళాను వేదికగా నూర్‌బాషా కో ఆపరేటివ్‌ సొసైటీ నాయకులను నిలదీశారు. దీంతో నేతలంతా మాటమార్చగా...ఓట్లు అడిగేందుకు వస్తారుగా... అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: సొసైటీల పేరుతో రుణాలందచేస్తామని సమావేశాలకు పిలిపించుకుని ఇప్పుడు రుణాల ఊసే ఎత్తడం లేదని  పలువురు మహిళలు నూర్‌బాషా కో ఆపరేటివ్‌ సొసైటీ నేతలను నిలదీశారు. వివరాల్లో కెళ్తే.. అనంతపురం నగర సమీపంలోని దూదేకుల కమ్యూనిటీ హాలులో ఆదివారం దూదేకుల యువతీయువకులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు ప్రతికా ప్రకటనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అనంతపురంతో పాటు కర్నూలు, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు. సమావేశంలో దూదేకుల సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ సి.బాబన్, జిల్లా అధ్యక్షుడు దాదాఖలందర్, జిల్లా మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ బాబా తాజుద్దీన్‌ తదితరులు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలతోపాటు, సంఘం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నాయకుల ప్రసంగాలు పూర్తయినా రుణాల ఊసేత్తలేదు.

దీంతో గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన మహిళలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ బాబన్, జిల్లా అధ్యక్షుడు దాదాఖలందర్, ఇతర నాయకులను రుణాల విషయమై నిలదీశారు. దూదేకుల ఫెడరేషన్‌ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసిన సంఘం నాయకులు రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని తెలిపారన్నారు.  దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమై కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకున్నామన్నారు. రుణాల ఆశచూపి సభలకు, సమావేశాలకు మూడేళ్లుగా తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిక నశించిన బాధిత మహిళలు జాబ్‌మేళాను వేదికగా చేసుకుని నూర్‌బాషా కో ఆపరేటివ్‌ సొసైటీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాయకులు సమాధానమిస్తూ రుణాలను అందించేందుకు ఈ సమావేశం నిర్వహించలేదన్నారు. రుణాల మంజూరు చేయడమంటే తమ జేబులోంచి డబ్బు తీసివ్వడం కాదన్నారు. మీకు రుణాలు కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మహిళలు విరుచుకుపడ్డారు. ఓట్లు అడిగేందుకు వస్తే అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఎన్నికలు వస్తున్నాయని సంఘం పేరుతో గిమ్మిక్కులు చేయాలని చూస్తే మోసపోవడానికి సిద్ధంగా లేమన్నారు. రుణాల పేరుతో మహిళలను సభలకు రప్పించుకోవడం, తిప్పుకోవడమే వీరి పని అంటూ శాపనార్థాలు పెట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top