‘ధర’ణిలో బతికేదెలా!

Due To Rainy Conditions Crop Yields Have Declined And Vegetable Prices Have Gone Up - Sakshi

అమ్మో..కొనలేం..తినలేం

నిమ్మకాయ ఒకటి రూ.6.30 

చుక్కలు చూస్తున్న కూరగాయల ధరలు 

హోటళ్లల్లోనూ తగ్గిన కూరల నాణ్యత 

మూతపడుతున్న కర్రీ పాయింట్లు

వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడులు తగ్గి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మిర్చి ముట్టుకోకుండానే మంటపుట్టిస్తుంటే..టమోటా ధర విని ఠారెత్తిపోతున్నారు. వంగ, బెండ, బంగాళదుంప, క్యారెట్, క్యాబేజీ ఇలా ఒకటేమిటి చివరకు ఆకుకూరల ధరలూ నింగినంటుతూ వినియోగదారునికి చుక్కలు చూపిస్తున్నాయి. 

సాక్షి, ఒంగోలు సిటీ: భోజనంలో షడ్రుచులకు కాలం కలిసి రావడం లేదు. సామాన్యుడు ఒక కూర చేసుకోవడానికి వెనుకాడుతున్నాడు. పచ్చడి మెతులుకు ఖరీదుగా మారాయి. వారానికి ఒక మారు తినే మాంసాహారాన్ని వాయిదా వేసుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలే రెండు, మూడు వారాలకు ఒక పర్యాయం తెచ్చుకుంటున్నారు. ఎక్కువ భాగం కుటుంబాలు పొదుపు, జాగ్రత్తకు అలవాటు పడుతున్నారు. కూరగాయలు..ఆకుకూరల ధరలు దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలోని కుటుంబాలకు సుమారు 450 టన్నుల వరకు వివిధ రకాల కూరగాయలు అవసరమవుతున్నాయి.

150 టన్నుల వరకు ఆకుకూరల అవసరం ఉంది. ఈ వేసవిలో దిగుబడులు బాగా తగ్గాయి. వీటిలో సగ భాగం కూడా  రావడం లేదు. వచ్చిన సరుకులోనూ అత్యధిక భాగం సచ్చులు, పుచ్చులు, నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అంత తాజాగా లేకపోయినా అవసరాలకు అనుగుణంగా వాటినే కొంటున్నారు. నిత్యం మార్కెట్‌కు వచ్చే కొన్ని రకాలు రెండు, మూడు రోజులకు ఒక మారు కూడా వచ్చే పరిస్థితి లేదు. మునక్కాయలు, నిమ్మకాయలు, క్యారెట్, క్యాబేజి, బంగాళా దుంపలు ఇలా కొన్ని రకాల కూరగాయలు తగినంత రావడం లేదు.

అమ్మో..కొనలేం..తినలేం
చుక్కలు చూస్తున్న ధరలతో సామాన్యుడు కూరగాయలు కొనలేకపోతున్నాడు. టమోటా నారాకోడూరు నుంచి జిల్లాకు వస్తుంది. మదనపల్లి నుంచి కొంత భాగం వస్తుంది. మార్కెట్‌లో నిన్న,మొన్నటి వరకు టమోటా కిలో రూ.60–రూ.70 వరకు విక్రయించారు. ప్రస్తుతం కిలో రూ.55–రూ.60 ధర పలుకుతోంది. జిల్లాలో కొంత భాగం బంగాళాదుంప సాగు చేశారు. దుంప కిలో రూ.35 విక్రయిస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి బంగాళదుంప తెస్తున్నారు. బంగాళదుంపలు బాగా గిరాకి పలుకుతున్నాయి. హాట్‌చిప్స్‌ తయారు చేసే వారు, హోటళ్ల నిర్వాహకులకే దుంప చాలడం లేదు. మార్కెట్‌లో చిన్న సైజు దుంప లభిస్తోంది. ధరలో మాత్రం తేడా లేదు. అల్లం కిలో రూ.170 వరకు విక్రయిస్తున్నారు. వెల్లుల్లి మొదటి రకం కిలో రూ.350 వరకు పలుకుతోంది. వెల్లుల్లి రెబ్బలకు మంచి గిరాకీ ఉంది. క్యాబేజి అరకొరగానే లభిస్తోంది. ఉల్లిపాయలు మహారాష్ట్ర నాశిక్, కర్నూలు నుంచి జిల్లాకు తెస్తున్నారు. పెద్ద సైజు ఉల్లిపాయలు కిలో రూ.25–రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లల్లోని ప్లాస్టిక్‌ సామాన్లు, పేపర్లు ఇతర పనికి రాని వస్తువులను ఉల్లిపాయలకు కొనే వారు రావడమే మానేశారు.

ఉల్లి ధర అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలను విరమించుకున్నారు. నిమ్మకాయ ఒకటి రూ.5.30పై అమ్ముతున్నారు. అదీ అంతగా నాణ్యత ఉండడం లేదు. నిమ్మ పిందెలు మార్కెట్‌లో లభించడం లేదు. హోటళ్లల్లో నిమ్మ దబ్బలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. గూడూరు, తెనాలి నుంచి నిమ్మ మార్కెట్‌ బాగా జరుగుతుంది. అక్కడి నుంచి తెచ్చిన సరుకు ఇక్కడ టోకుకు విక్రయిస్తున్నారు. చిల్లరగా నిమ్మకాయ రూ.5.30 అదే డజను రూ.60కి అమ్ముతున్నారు. అల్లం మార్కెట్‌ కడప అధికంగా ఉంటుంది. అక్కడి నుంచి అల్లం దిగుబడి బాగా తగ్గింది. మార్కెట్‌లో మునక్కాయ లభించడం లేదు. 250 గ్రాములు మునక్కాయలు రూ.50కి విక్రయిస్తున్నారు. మిర్చి కిలో రూ.65 ధర పలుకుతోంది. రెండో రకం కిలో రూ.55కి అమ్ముతున్నారు.

ఏ రకం తీసుకున్నా అమ్మో అనక మానదు. కూరగాయలు కొనలేం..తినలేం. ఆకుకూరలు అధికంగా కొత్తపట్నం, అద్దంకి, బేస్తవారపేట తదితర ప్రాంతాల నుంచి మార్కెట్‌లోకి వస్తుంది. రూ.10కి మూడు కట్టలు ఇచ్చే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు రూ.10కి ఒక కట్టే ఇస్తున్నారు. తోటకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర ధరలు దడపుట్టిస్తున్నాయి. కొత్తిమీర గిరాకీ బాగా పెరిగింది. నా«ంధేడ్‌ మార్కెట్‌ వట్టిపోయింది. జిల్లా మార్కెట్‌కు స్ధానికంగా పండే కొత్తిమీర తగ్గిపోయింది. ఇక నాంథేడ్‌ మార్కెట్‌ నుంచి వచ్చే కొత్తిమీరే దిక్కు. కొత్తిమీర అవసరమైనా ధర చూసి విరమించుకుంటున్నారు. పుదీనా కట్ట రూ.30 ధర పలుకుతోంది. మార్కెట్‌లో పుదీనా కన్పించడం లేదు. కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్‌లో కొనే పరిస్ధితి లేదు.

సామాన్యుడి నోటికి చిక్కం
మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన ధరలను చూసి సామాన్యుడు గుడ్లు తేలేస్తున్నాడు. తినాలని కోరిక ఉన్నా నోటికి చిక్కం కట్టుకుంటున్నాడు. పిల్లలకు పౌష్టికాహారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. వసతి గృహాల్లో కూరలు, సాంబారుకు కూరగాయలు వేయాలంటే వెనుకాడుతున్నారు. అంతగా నాణ్యత లేని సాంబారు, రసం దక్కుతుంది. హోటళ్లల్లో కూరలకు గిరాకీ పెరిగింది. నిత్యం రద్దీగా ఉంటే హోటళ్లలోనే కూరల రకాలను తగ్గించేస్తున్నారు. సాంబారులో వేసే కూరగాయల రకాలను తగ్గించేస్తున్నారు. సామాన్యుడు కర్రీస్‌ పాయింట్లపై ఆధారపడ్తున్నారు. ఒంగోలు నగరంలో ప్రతి బజారులో కర్రీ పాయింట్‌  ఉండేది. ఇప్పుడు సగానికిపైగా కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. పెరిగిన కూరగాయలు, ఆకుకూరల ధరలతో కర్రీ పాయింట్లను నిర్వహించడం వల్లకాదంటున్నారు. పెద్ద కర్రీ పాయింట్లలో ఆ రోజుకు తక్కవగా ఉన్న కూరగాయల రకాలతో వండిన కూరలను విక్రయిస్తూ నెట్టుకొస్తున్నారు. 

కరువు పీడిస్తోంది
భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగు నీరు ఐదేళ్లుగా రాలేదు. సాగు విస్తీర్ణం పడిపోయింది. బోర్ల కింద కూరగాయల సాగు జరుగుతోంది. సుమారు లక్షన్నర ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నా జిల్లా అవసరాలకు అనుగుణంగా సరుకు దిగుబడి రావడం లేదు. వానలు పడకపోయినా, భూగర్భ జలాలు పెరగకపోయినా కూరగాయల మార్కెట్‌ సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్టూరు మార్కెట్‌లోనూ కూరగాయలు ధరలు దడ పుట్టిస్తున్నాయి. అద్దంకి సంతలో సామాన్యులకు ధరలు అందుబాటులో లేవు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top