మందులున్నా మీకివ్వం! | Drug stores full of medicines .. Nil in hospitals | Sakshi
Sakshi News home page

మందులున్నా మీకివ్వం!

Sep 21 2017 3:47 AM | Updated on Oct 16 2018 3:26 PM

మందులున్నా  మీకివ్వం! - Sakshi

మందులున్నా మీకివ్వం!

ఆకలితో కొందరు.. అరగక మరికొందరు అంటే ఇదే మరి!

- డ్రగ్‌ స్టోర్‌లలో ఔషధాలు ఫుల్‌.. ఆస్పత్రుల్లో నిల్‌ 
- తన అనుమతి లేనిదే ఒక్క మాత్ర కూడా ఇవ్వొద్దన్న జనరల్‌ మేనేజర్‌
- సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ ఫార్మాసిస్ట్‌లకు మౌఖిక ఆదేశాలు జారీ
- హీమోఫీలియా రోగికి ఇంజక్షన్‌ ఇచ్చినందుకు కాకినాడలో ఫార్మాసిస్ట్‌కు మెమో
- మందులు కావాలని డీఎంఈకి కడప రిమ్స్, గుంటూరు ఆస్పత్రుల అధికారుల మొర
 
సాక్షి, అమరావతి: ఆకలితో కొందరు.. అరగక మరికొందరు అంటే ఇదే మరి! ఓవైపు ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేసే సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లలో మందుబిళ్లలు కోకొల్లలుగా ఉండగా మరోవైపు ఆస్పత్రుల్లో మందులు లేక రోగులు విలవిలలాడుతున్నారు. ఇదేమంటే మీ బడ్జెట్‌ అయిపోయింది.. మేం కొనుగోలు చేసిన మందులన్నీ మీకు ఇవ్వడానికా? అని ప్రశ్నిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఒక్క మాత్ర కూడా ఆస్పత్రులకు ఇవ్వకూడదని రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) జనరల్‌ మేనేజర్‌ గుప్తా కచ్చితంగా చెప్పారని పలువురు ఫార్మసిస్ట్‌లు ‘సాక్షి’కి తెలిపారు.
 
మందుల కోసం ఆస్పత్రులు పడిగాపులు
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు మందులకోసం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఓవైపు జ్వరాల సీజన్‌ కావడంతో రోజు రోజుకూ ఔట్‌పేషెంటు రోగులు పెరుగుతున్నారు. మరోపక్కన ఈ ఔషధిలో కూడా బడ్జెట్‌ దాటిపోయినట్టు చెబుతూ ఒక్క మాత్ర కూడా అదనంగా ఇచ్చేది లేదని చెబుతున్నారు. నిత్యం వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన సిరంజిలు ఏ ఒక్క ఆస్పత్రిలోనూ స్టాకు లేవని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
 
ఎండీసీ సెంటర్లు ఎత్తేసిన అధికారులు
బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో గతంలో ఉన్న ఎండీసీ (మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్స్‌)ను ఎత్తేశారు. ఎంత అత్యవసరమైనా రోగుల సంఖ్య, మందుల పరిమాణం గురించి మూడు నెలల ముందుగా సమాచారం ఇస్తేనే సరఫరా చేస్తామని చెబుతున్నారు. మరోవైపు సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లలో బఫర్‌ స్టాకు కింద నిల్వ చేసిన మందుల కాల పరిమితి ముగిసిపోతోందని కొందరు ఫార్మసిస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఇంజక్షన్‌ ఇచ్చారని ఫార్మసిస్ట్‌కు మెమో
పరిస్థితి ఎంత దిగజారిందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. కాకినాడ సర్వజనాసుపత్రిలో హీమోఫీలియాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేషెంటుకు సూపరింటెండెంట్‌ అనుమతితో ఫార్మసిస్ట్‌ ఇంజక్షన్‌ ఇచ్చారు. ఇది తెలుసుకున్న ఏపీఎంఎస్‌ఐడీసీ జనరల్‌ మేనేజర్‌ మెమో జారీచేశారు. దీంతో మిగతా డ్రగ్‌ స్టోర్స్‌లలో ఉన్న ఫార్మసిస్ట్‌లు ప్రాణం మీదకు వచ్చినా ఒక్క ఇంజక్షన్‌ కూడా ఇవ్వడం లేదు.
 
పలు బోధనాసుపత్రుల నుంచి డీఎంఈకి లేఖలు
బోధనాసుపత్రుల్లోనే మందులు లేక అల్లాడుతున్నారు. ప్రధానంగా కొద్ది రోజులుగా సిరంజిలు లేవు. గుంటూరు, కడప రిమ్స్, ఒంగోలు రిమ్స్‌ లాంటి బోధనాసుపత్రుల్లో ఖరీదైన హీమోఫీలియా నియంత్రణకు వాడే ఇంజక్షన్లు లేవని సూపరింటెండెంట్‌లు ఇప్పటికే వైద్య విద్యా సంచాలకులకు లేఖలు రాశారు.  దీనిపై ఏపీఎంఎస్‌ఐడీసీ జనరల్‌ మేనేజర్‌ గుప్తాను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
 
గ్రీన్‌ చానెల్‌కు రెడ్‌సిగ్నల్‌
మందులకు సంబంధించి నిధులు గ్రీన్‌చానెల్‌లో ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా 2016 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకూ కొత్తగా మందులు కొనేందుకు గానీ, కొన్న మందులకు గానీ ఒక్క పైసా చెల్లించలేదు. ఇప్పటిదాకా కొన్నవాటికే రూ.40 కోట్లు బకాయిలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాక మందుల కొనుగోలు బిల్లులు నిలిచిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు : 1157 
రాష్ట్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు: 192 
ఏరియా ఆస్పత్రులు : 32
8 జిల్లా ఆస్పత్రులు
11 బోధన ఆసుపత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement