మన్యంలోని గిరిజనులకు వైద్యసేవలు మరింత చేరువగా అందించే లక్ష్యంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది.
	- పెదబయలు పీహెచ్‌సీలో వైద్యాధికారి కరువు
	- గోమంగి, రూడకోటకు ఇన్‌చార్జిలే దిక్కు
	- వారానికో రోజే వైద్యుల దర్శనం
	- మౌలిక సదుపాయాలు లేవు
	పెదబయలు : మన్యంలోని గిరిజనులకు వైద్యసేవలు మరింత చేరువగా అందించే లక్ష్యంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది. పెదబయలు పీహెచ్‌సీలో 10 రోజుల నుంచి వైద్యాధికారి లేరు. గోమంగి, రూడకోట పీహెచ్‌సీల్లో ఇన్‌చార్జి వైద్యులు ఉన్నారు.  గోమంగి పీహెచ్‌సీ వైద్యాధికారి మూడు పీహెచ్‌సీల్లో, రూడకోట  వైద్యాధికారి రెండు పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఏ ఒక్క చోటా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎపిడమిక్ సీజన్‌లో కూడా పీహెచ్‌సీ వైద్యులు లేకపోవడంతో  మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
	
	పెదబయలు పీహెచ్‌సీ స్లాబు నుంచి వర్షాలకు నీరు లీకేజీ అవుతుంది. రోగులకు సరిపడిన బెడ్లు,  బెంచీ లు,  రన్నింగ్ వాటర్ సదుపాయం వంటివి కానరావు. గోమంగి పీహెచ్‌సీలో ప్రారంభం నుంచి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం లేదు. పూర్తి స్థాయి వైద్యాధికారి లేరు. రూడకోట  పీహెచ్‌సీలో నీటి నీటి ఎద్దడి, పూర్తి స్థాయి వైద్యాధికారి, సిబ్బం ది కొరత ఉంది.ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్ , ఎల్‌టి మా త్రమే విధులు నిర్వహిస్తున్నారు.  
	
	గత నెలలోనే  పె దబయలు, మారుమూల రూడకోట పీహెచ్‌సీలకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఐటీడీఏ పీవోను కలిసిన రూడకోట గ్రామస్తులు పూర్తి స్థాయి వైద్యాధికారిని నియమించాలని కోరా రు.  దీనికి కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో నియమిస్తానని హామీ ఇచ్చారు. అయితే మూడు వారాలు గడిచినా  వైద్యాధికారి రాలేదు.   ఇప్పటికైన అధికారులు స్పందించి మూడు పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయి వైద్యులు, పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు, కల్పించాలని మండల వాసులు కోరుతున్నారు.
	 
	పూర్తి స్థాయి వైద్యుల్ని నియమించాలి
	పెదబయలు, గోమంగి, రూడకోట పీహెచ్‌సీల్లో ఎపిడమిక్ సీజన్‌లో వైద్యులు లేకపోవడం విచారకరం. అలాగే పీహెచ్‌సీల్లో రోగులకు కనీస సదుపాయాలు లేవు. సిబ్బంది కొరత ఉంది.  24 గంటల ఆస్పత్రిలో వైద్యాధికారి లేరు.  రెండు రోజుల  వ్యవధిలో వైద్యాధికారిని నియమిస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు. వారం రోజులైనా వైద్యాధికారి రాలేదు.
	 - సల్లంగి ఉమామహేశ్వరరావు, ఎంపీపీ, పెదబయలు మండలం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
