ట్రాన్స్‌ట్రాయ్‌.. డబ్బులేమయ్యాయ్‌?

DRI probe into non-payment of bills to subcontractors in Polavaram - Sakshi

పోలవరంలో సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై డీఆర్‌ఐ దర్యాప్తు

బావర్, కెల్లర్‌ సంస్థలకు బకాయిలిప్పించాలని పీఎంవోకు జర్మనీ రాయబారి విజ్ఞప్తి

కమీషన్‌ల కోసం ఎస్క్రో అకౌంట్‌కు మంగళం.. 

ట్రాన్స్‌ట్రాయ్‌కు మేలుచేసిన చంద్రబాబు సర్కారు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో సబ్‌ కాంట్రాక్టు కింద డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేసిన బావర్‌.. జెట్‌ గ్రౌటింగ్‌ చేసిన కెల్లర్‌ సంస్థలకు బకాయిపడిన బిల్లులను చెల్లించక పోవడంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) విచారణకు రంగం సిద్ధం చేసింది. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లించేలా కేబినెట్‌ తీర్మానం చేసిందని, అయితే దాన్ని తుంగలో తొక్కడం వల్లే తమ దేశానికి చెందిన బావర్, కెల్లర్‌ సంస్థలకు రావాల్సిన బిల్లులు చేరలేదని పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం), డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌)కు జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. బావర్‌.. కెల్లర్‌లకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై డీపీఐఐటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది.

ట్రాన్స్‌ట్రాయ్‌ వద్ద ఆ రెండు సంస్థలు సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులున్నీ ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిందని డీపీఐఐటీకి తేల్చి చెప్పింది. బావర్, కెల్లర్‌లకు ట్రాన్స్‌ట్రాయ్‌ బకాయి పడినందున వాటితో తమకు సంబంధం లేదని పీఎంవోకూ నివేదించింది. 2015–19 మధ్య కాలంలో పోలవరం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని డీఆర్‌ఐని పీఎంవో ఆదేశించింది. డీఆర్‌ఐ రంగంలోకి దిగితే చంద్రబాబు కమీషన్‌ల బాగోతం వెలుగు చూస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ట్రాన్స్‌ట్రాయ్‌ ముసుగులో కమీషన్ల దందా
పోలవరం హెడ్‌ వర్క్స్‌ను ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్‌సీ–యూఈఎస్‌(జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013  మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జేవీలో విదేశీ సంస్థలైన జేఎస్‌సీ, యూఈఎస్‌ వాటా 87 శాతం. అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ వాటా కేవలం 13 శాతమే. చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి రాయపాటి భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. కానీ.. 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం తీసుకున్నారు.

2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. విభజన చట్టం ప్రకారం పోలవరంను శరవేగంగా పూర్తి చేయడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సూచించింది. అదే జరిగితే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయమని, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపడితే కమీషన్‌లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా మోకాలడ్డారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక.. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారు. 

కమీషన్ల కోసం కేబినెట్‌ తీర్మానం తుంగలోకి..
ట్రాన్స్‌ట్రాయ్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తామని 2015 అక్టోబర్‌ 10న కేబినెట్‌లో అప్పటి సీఎం చంద్రబాబు తీర్మానం చేయించారు. ఆ మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ట్రాన్స్‌ట్రాయ్‌–సబ్‌ కాంట్రాక్టు సంస్థలు, పోలవరం ఎస్‌ఈల పేరు మీదుగా ఎస్క్రో ఖాతా తెరిచారు. ఆ ఖాతా ద్వారా బిల్లులు చెల్లిస్తామని చూపి.. చంద్రబాబు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ద్వారా రూ.300 కోట్ల రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇప్పించారు. కానీ.. ట్రాన్స్‌ట్రాయ్‌ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లు చెల్లిస్తే.. ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్‌ ద్వారా చెల్లించారు. మిగతా రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించారు. ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లిస్తే రుణం కింద బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మినహాయించుకుంటుందని.. కమీషన్‌లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కి నేరుగా బిల్లులు చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

బకాయిల చెల్లింపుపై దాటవేత
డయా ఫ్రమ్‌ వాల్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పునాది) పనులను రూ.422 కోట్లతో చేపట్టడానికి బావర్‌–ఎల్‌ అండ్‌ టీ సంస్థ, రూ.125.91 కోట్లతో జెట్‌ గ్రౌటింగ్‌ (కాఫర్‌ డ్యామ్‌ల పునాది) పనులు చేయడానికి కెల్లర్‌ సంస్థలు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. డయా ఫ్రమ్‌ వాల్‌ పనులకు మాత్రమే ఎస్క్రో ఖాతా ద్వారా రూ.95 కోట్లను సర్కార్‌ చెల్లించింది. మరో రూ.237.09 కోట్ల బిల్లులు నేరుగా చెల్లించారు. 2018 నాటికే పనులు పూర్తయినా రూ.89.91 కోట్ల బిల్లులు ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించలేదు. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు చేసిన కెల్లర్‌ సంస్థకూ రూ.44 కోట్లు బకాయిపడ్డారు. 2018 నుంచి 2019 మే వరకు చంద్రబాబు ప్రతి సోమవారం నిర్వహించిన వర్చువల్‌ రివ్యూల్లో ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి ఆ బిల్లులు ఇప్పించాలని ఆ రెండు సంస్థల ప్రతినిధులు కోరినా ఫలితం లేకపోయింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top