ప్రాణం తీసిన వైద్యం

Doctor Negligence Mother And Child Deaths in Anantapur - Sakshi

అందుబాటులో లేని వైద్యుడు

ఏఎన్‌ఎంతో ప్రసవం చేయించిన వైనం

గంట వ్యవధిలోనే మృతి చెందిన తల్లీ,బిడ్డ

కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబం

పెద్దవడుగూరు: వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రసవాన్ని ఓ ఏఎన్‌ఎం చేయడంతో తల్లీ, బిడ్డ మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే... పెద్దవడుగూరు మండల పరిధిలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన చిన్న కంబన్న, లక్ష్మమ్మల చిన్న కుమార్తె నాగేశ్వరమ్మను గత ఏడాది యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన మద్దిలేటిస్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. నాగేశ్వరమ్మ గర్భం దాల్చడంతో వారి కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. 5 నెలలు నిండగానే నాగేశ్వరమ్మ తల్లితండ్రుల ఇంటికి వచ్చింది. అప్పటి నుండి క్రిష్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈనెల 10వ తేదీని డెలివరీ డేట్‌గా చెప్పారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం 11 గంటలకు ప్రసవం కోసం క్రిష్టిపాడు ఆస్పత్రికి వెళ్ళారు.

అక్కడి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి నొప్పులు రావడం కోసం మాత్ర ఇచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఏఎన్‌ఎం జ్యోతి ప్రసవం చేసింది. 7:20 నిమిషాలకు నాగేశ్వరమ్మ మగ్గ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని వెంటనే తాడిపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో నాగేశ్వరమ్మను ఆస్పత్రిలోనే ఉంచి బిడ్డను మాత్రం తాడిపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బిడ్డ మృతి చెందాడని చెప్పడంతో వెనుతిరిగి వచ్చారు. అయితే అప్పటికే నాగేశ్వరమ్మకు అ«ధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను కూడా గుత్తికి తీసుకెళ్ళాలని వైద్యసిబ్బంది చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నాగేశ్వరమ్మ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో వారి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు.

ఏఎన్‌ఎంతోనే కాన్పులు
డ్యూటీకి సక్రమంగా చేయని వైద్యుడు శ్రీనివాసరెడ్డి తన పబ్బంగడుపుకునేందుకు ఓ ఏఎన్‌ఎం చేతనే కాన్పులను చేయిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఎవరు కాన్పుకు వచ్చినా సరే ఈ వైద్యుడు అందుబాటులో ఉండడని స్థానిక సీపీఐ నాయకులు చెబుతున్నారు. పైగా ఏఎన్‌ఎంపై ఒత్తిడి తెచ్చి కాన్పులు చేయిస్తూ వస్తున్నాడని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తల్లీ, బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉదయమే వైద్యుడి ప్రత్యక్షం
నాగేశ్వరమ్మ ఆమె బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న వైద్యుడు శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయమే ఆస్పత్రిలో ప్రత్యక్షం కావడం విశేషం. తల్లీ,బిడ్డ మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, సీపీఐ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.  

వైద్యుడి నిర్వాకంతోనే...
కిష్టపాడు ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి నిర్లక్ష్యం  కారణంగానే తల్లీ, బిడ్డ మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరమ్మకు 10వ తేదీని డెలివరీ డేట్‌గా ముందుగానే నిర్ణయించారు. అయినా కూడా వైద్యుడు అందుబాటులో ఉండకుండా ఏఎన్‌ఎం చేత ప్రసవం చేయించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని అంటున్నారు. శ్రీనివాసరెడ్డి విధులను కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు డ్యూటీకి వచ్చి రెండు గంటలలోపే వెళ్లిపోతున్నాడని అంటున్నారు.  

షాక్‌లో కుటుంబ సభ్యులు
గంట వ్యవధిలోనే నాగేశ్వరమ్మతో పాటు బిడ్డ ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నామని తల్లీబిడ్డతో ఇంటికి వెళ్దామనుకుంటే వారి శవాలను తీసుకెళ్ళాల్సి వస్తుందనుకోలేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. దీంతో భీమునిపల్లిలో విషాదఛాయలు అలముకున్నారు.

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
కిష్టపాడు ఆస్పత్రిలో ఏఎన్‌ఎం ఆధ్వర్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయని అందరికీ తెలిసినా వైద్యశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్న నేటి కాలంలోనూ సరైన వైద్యసేవలు అందక రెండు నిండు ప్రాణాలు పోవడం బాధాకరం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top