నాణ్యత లేని విత్తనాన్ని అనుమతించొద్దు 

Do not allow quality seed says Department of Agriculture - Sakshi

విత్తనాల పంపిణీలో అప్రమత్తంగా ఉండాలి 

అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు 

సాక్షి, అమరావతి: వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్ని జిల్లాల వ్యవసాయాధికారులను, ఏపీ సీడ్స్‌ అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చెప్పారు. అనంతపురం జిల్లాలో నాలుగు ట్రక్కులు నాణ్యత లేని వేరుశనగ విత్తన కాయలు సరఫరా అయిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఆమె శనివారం అధికారులకు సందేశం పంపారు. విత్తన పంపిణీ పూర్తయ్యాక రైతుల నుంచి ఆరోపణలు రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. నాణ్యత లేని కాయల్ని సరఫరా చేసిన సంస్థల్ని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడంతోపాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీడ్స్‌ను ఆదేశించారు. 

► వ్యవసాయశాఖ ఏడీలు సరుకు ఎక్కడ నుంచి బయలుదేరుతుందో అక్కడే తనిఖీలు నిర్వహించాలి. నాణ్యతను నిర్ధారించాకే సరఫరాకు అనుమతించాలి. 
► నాణ్యత లేని విత్తనాన్ని వ్యవసాయ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దన్న గట్టి హెచ్చరిక వెళ్లాలి. 
► వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంపిణీ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ చాలా పట్టుదలతో ఉన్నారు. నాణ్యత లేనివాటిని రైతులకు అంటగడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 

ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌పై ఏం ఉంటుందంటే.. 
బస్తా బరువు, కాయల శుభ్రత, మొలక శాతం, తేమ, కలుపు, గరిష్ట చిల్లర ధర వంటివి ఉంటాయి. ఏ సంస్థ నుంచి ఏపీ సీడ్స్‌కు వచ్చాయో కూడా ఉంటుంది. అయితే.. ఇవేవీ ప్రభుత్వ సంస్థలు గుర్తించి ఇచ్చిన ప్రకటనలు కావు. ఆయా సంస్థలు తమకు తాము ఇస్తున్నవే.  

ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ ఉండాలా? వద్దా? 
ఏపీ సీడ్స్‌కు సరఫరా చేస్తున్న విత్తన బస్తాలపై సర్టిఫైడ్‌ ట్యాగ్‌కు బదులు ఆయా సంస్థలు ఇస్తున్న ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ (స్వీయ విశ్వసనీయ ప్రకటన) ఉండడాన్ని అనుమతించాలా, వద్దా అనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ను కోరారు. సర్టిఫైడ్‌ ట్యాగ్‌ ఉంటే ఇక ఆ విత్తనానికి తిరుగుండదు. అదే ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ అయితే ఆయా విత్తన సంస్థలు ఇచ్చే స్వచ్ఛంద ప్రకటన మాత్రమే. ఇప్పుడు ఇలా లేబుల్‌ ఉన్న వాటిల్లోనే నాణ్యత లేని కాయలు వచ్చాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top