మార్కెట్లలో డిస్పెన్సరీలు? | dispensaries are in market? | Sakshi
Sakshi News home page

మార్కెట్లలో డిస్పెన్సరీలు?

Aug 30 2013 4:12 AM | Updated on Sep 1 2017 10:14 PM

యవసాయ మార్కెట్‌లలో ప్రాథమిక వైద్యం అందించేందుకు డిస్పెన్సరీల ఏర్పాటు అంశాన్ని మార్కెటింగ్ శాఖ పరిశీలిస్తోంది. తాజాగా దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు. మార్కెట్ వర్గాలకు తక్షణ వైద్యసహాయం అందించేందుకు డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: వ్యవసాయ మార్కెట్‌లలో ప్రాథమిక వైద్యం అందించేందుకు డిస్పెన్సరీల ఏర్పాటు  అంశాన్ని మార్కెటింగ్ శాఖ పరిశీలిస్తోంది. తాజాగా దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు. మార్కెట్ వర్గాలకు తక్షణ వైద్యసహాయం అందించేందుకు డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాసరి శ్రీనివాసులు ఇటీవల ఈ శాఖాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి జిల్లా నుంచి మార్కెటింగ్ శాఖ జేడీ సుధాకర్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసులు  తదితరులు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్‌లలో లావాదేవీలు సాగుతున్నాయి. మార్కెట్‌లలో సరుకుల విక్రయానికి వచ్చే రైతులు, పనిచేసే దడువాయిలు, గుమాస్తాలు, ఎడ్లబండ్ల కార్మికులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఉన్నారు.
 
  ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ సంఖ్య సీజన్‌లో ఐదారువేల మందికి చేరుతోంది.  ఇతర మార్కెట్‌లలో కూడా రెండు నుంచి మూడు వేల మంది ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యార్డుల్లోనే వీరంతా వివిధ పనులు చేస్తూంటారు. ముఖ్యంగా ధాన్యం, ఇతరత్రా పంట ఉత్పత్తుల తూకం, బస్తాలను తరలించే సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి, మిర్చితో పాటు పంట ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన సమయంలో యార్డుల్లో దుమ్ముదూళి పెరుగుతోంది. మిర్చి సీజన్‌లో ఎండ వేడి, మంటతో ఊపరాడని పరిస్థితులు నెలకొంటాయి. ఒకరిద్దరు రైతులు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. దుమ్ముధూళి ఇతరత్రా వాటితో ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరికి తక్షణం వైద్యసహాయం అందించేందుకు ఈ డిస్పెన్సరీలు దోహదం చేసే అవకాశం ఉంది. ఎదైనా సంఘటన జరిగితే ప్రాథమిక వైద్యం అందించేందుకు అక్కడే వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. దీనికి మార్కెట్ కమిటీలు, అధికారుల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 వ్యవసాయ మార్కెట్‌లకు రైతుల పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలపై ఆధారపడి ఆదాయం లభిస్తోంది. గణనీయంగానే ఈ ఆదాయం ఉన్నప్పటికీ రైతులకు తగిన సేవలందించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక వైద్యం అందించేందుకు చర్యలు చేపడితే రైతుల నుంచి మన్ననలు పొందవచ్చు. ప్రస్తుతం ఎనుమాముల లాంటి పెద్ద మార్కెట్‌లలో మెడికల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసి నిర్ధిష్ట వేళల్లో వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ జిల్లాలో మిగిలిన మార్కెట్‌లలో ఈ పరిస్థితిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సి ఉన్నందున విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రాథమిక స్థాయిలో చర్చించినట్లు తెలుస్తోంది. డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తే వైద్యం అందించడం, ఉచితంగా మందులు అందించడం, డాక్టర్, వసతి తదితర అంశాలన్నీంటిని పరిగణలోకి తీసుకొని వాటికి అయ్యే వ్యయాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement